చెన్నైలో హై అలర్ట్..

21:27 - December 5, 2016

చెన్నై : జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో తమిళనాడులో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రం ప్రత్యేక ఆర్మీ బలగాలను తమిళనాడుకు పంపింది. చెన్నైలో 15 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. చెన్నైలో ఐటి సంస్థలు, విద్యాసంస్థలు, పెట్రోల్‌ బంకులు, షాపులను మూసివేశారు. చెన్నై మొత్తం ఆర్మీ, పోలీసు బలగాలతో నిండిపోయింది. శాంతి భద్రతలు కాపాడడానికి చెన్నైలో 15 వేల మంది ప్రత్యేక పోలీసుల బలగాలను మోహరించారు. జయలలిత నివాసం పొయెస్‌ గార్డన్‌ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నైలోని అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

వదంతులు నమ్మవద్దు..
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వదంతులను నమ్మొద్దని ప్రజలకు చెన్నై పోలీసులు విజ్ఞప్తి చేశారు. సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లపై నిఘా పెట్టినట్లు పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. అమ్మ ఆరోగ్యం విషమించిందన్న సమాచారంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. భారీ సంఖ్యలో అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో భారీగా భద్రతా దళాలను మోహరించారు. కొందరు కార్యకర్తలు ఆస్పత్రిలోనికి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు.

హై డ్రామా..
ఆస్పత్రిలోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సీరియస్‌ కేసులను సైతం జాగ్రత్తగా అంబులెన్స్‌ల ద్వారా వేరే ఆస్పత్రులకు మారుస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బస్సులు, రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు కాపలాగా ఉన్నారు. ప్రజలు తమ ప్రయాణాలను సైత వాయిదా వేసుకుని తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. తమిళనాడుకు బస్సు సర్వీసులు నడపవద్దని ఆర్టీసీని ఆదేశించింది. చెన్నై వెళ్లే అన్ని ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా నిలిపివేసింది.

Don't Miss