అనంతలోకాలకు 'చైతన్య రథ సారధి' ..

20:31 - August 29, 2018

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. 
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హరికృష్ణ..
టీడీపీ సీనియర్‌ నేత, సినీ నటుడు హరికృష్ణ హైదరాబాద్‌ నుంచి నెల్లూరులోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నల్లగొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద కారు బోల్తాపడింది. ప్రమాద సమయంలో కారులో ఆయనతోపాటు శివాజీ, వెంటకట్రావు ఉన్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారు ఎడమవైపు నుంచి కుడివైపునకు పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని రాసుకుంటూ వెళ్లింది. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఆయన్ను నార్కెట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ హరికృష్ణ ప్రాణాలను కాపాడలేకపోయారు. అయితే హరికృష్ణను ఆస్పత్రికి తరలించినప్పటికే స్పృహలేదని డాక్టర్లు చెబుతున్నారు.

వాటర్‌ బాటిల్‌ అందుకునేందుకు ప్రయత్నంలో ప్రమాదం..
హరికృష్ణతోపాటు కారులో ప్రయాణించిన మరో ఇద్దరు శివాజీ, వెంకట్రావు గాయాలతో బయపడ్డారు. వీరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. హరికృష్ణ వాటర్‌ బాటిల్‌ అందుకునేందుకు ప్రయత్నించినప్పుడు ప్రమాదం జరిగిందిని వీరు చెప్పారు. కారు పల్టీ కొట్టి డోర్‌ తెరుసుకోవడంతో హరికృష్ణ దూరంగా పడిపోయారు. ప్రమాదం జరినప్పుడు కారు వంద కి.మీ. వేగంలో ప్రయాణించి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కారును హరికృష్ణ స్వయంగా నడిపారు. సీటుబెల్టు పెట్టుకోనందునే తీవ్రగాయాలయ్యాయి. సీటు బెల్టు పెట్టుకుని ఉండే ప్రణాలు దక్కేవని స్థానికులన్నారు.

హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హరికృష్ణ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైన తరువాత ప్రత్యేక అంబులెన్స్‌లో భౌతికకాయాన్ని హైదరాబాద్‌- మెహిదీపట్నంలోని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. హరికృష్ణ భౌతికకాయం వెంట ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ మంత్రి లోకేశ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, త్రివిక్రమ్ ఉన్నారు. 
మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి చనిపోవటం చాలా బాధాకరం : సీఎం చంద్రబాబు
ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి చనిపోవటం చాలా బాధాకరమని తెలిపారు సీఎం చంద్రబాబు. హరికృష్ణ మృతి పట్ల సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపారు. హరికృష్ణ తనకంటూ ప్రత్యేకత, గుర్తింపు సాధించారని చంద్రబాబు అన్నారు. హరికృష్ణ ఏ పదవిలో ఉన్న నీతి-నిజాయితీతో పనిచేసేవారని చంద్రబాబు చెప్పారు. 

Don't Miss