తండ్రికి అండగా..సారధిగా..

21:39 - August 29, 2018

హైదరాబాద్ : టీడీపీ రాజకీయాల్లో హరికృష్ణకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ తనయుడిగానే కాకుండా కుటుంబ రాజకీయాల్లో రెబల్‌గా హరికృష్ణకు పేరుంది. మంత్రి, ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా వివిధ పదవులు నిర్వహించారు. చంద్రబాబు... ఎన్టీఆర్‌తో విభేదించి ప్రభుత్వ పగ్గాలు చేపట్టినప్పుడు హరికృష్ణ.. చంద్రబాబుకు అండగా నిలించారు.
తండ్రి వెంటనే నడిచిన హరికృష్ణ
ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చాక హరికృష్ణ ఆయన వెంటే నడిచారు. ఎన్టీఆర్‌ ఎన్నికల ప్రచార వాహనం చైతన్య రథాన్ని ఆయనే నడిపారు. ఒకసారి కాదు... రెండు సార్లు కాదు... నాలుగుసార్లు చైతన్య రథాన్ని నడిపిన ఘనత హరికృష్ణకే దక్కింది. 1983, 85, 89, 94 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ చైతన్య రథాన్ని స్వయంగా నడిపి... తండ్రికి అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉన్నారు హరికృష్ణ. మొదటిసారి 9 నెలల పాటు చైతన్య రథానికి సారథిగా వ్యవహరించారు.

చంద్రబాబుతో చేతులు కలిపిన హరికృష్ణ ..రవాణా మంత్రిగా బాధ్యతలు
1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌తో చంద్రబాబు విభేదించి... 1995లో రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు, టీడీపీ సారథ్యం చేపట్టారు. అప్పుడు హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌కు కాదని... బావ చంద్రబాబుతో చేతులు కలిపారు. తనకు అండగా నిలిచినందుకు చంద్రబాబు.. తన మంత్రివర్గంలో హరికృష్ణకు స్థానం కల్పించారు. అప్పట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించారు. 1996లో జనవరిలో ఎన్టీఆర్‌ మరణం తర్వాత ఆయన ప్రాతినిధ్యం వహించిన అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో హరికృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్‌ లక్ష్మీనారాయణరెడ్డిపై 62 వేల ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందారు. అయితే చంద్రబాబు తన కేబినెట్‌లో హరికృష్ణకు స్థానం కల్పించకుండా విస్మరించారు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని వాడుకుని వదిలేశారన్నవిమర్శలను చంద్రబాబు ఎదుర్కొన్నారు. 1999 వరకు ఎమ్మెల్యేగానే కొనసాగారు. నాలుగేళ్లపాటు హిందూపురంలో ప్రజా సమస్యలు పరిష్కరించి అందరి మన్ననలు పొందారు.

1999 జనవరి 26 అన్న తెలుగుదేశం పార్టీ స్థాపన

1999లో హరికృష్ణ.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురుతిరిగారు. టీడీపీకి పోటీగా 1999 జనవరి 26న అన్న టీడీపీ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ సిద్ధాంతాలకు చంద్రబాబు తిలోదకాలిస్తూ... ఎన్టీఆర్‌ వారసత్వాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అన్న తెలుగుదేశమే నిజమైన టీడీపీ అని ప్రచారం చేశారు. 1999 ఎన్నికల్లో హరికృష్ణ నాయకత్వంలోని అన్న టీడీపీ పోటీ చేసినా ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. సోదరుడు బాలకృష్ణ... చంద్రబాబుకు మద్దతుగా నిలించినా.. హరికృష్ణ మాత్రం చాలా కాలం బాబుకు దూరంగానే ఉన్నారు. 2009 ఎన్నికలకు ముందు హరికృష్ణతోపాటు ఆయన తనయుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను చంద్రబాబు మరోసారి దగ్గరకు తీశారు. అప్పట్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీకి ప్రచారం చేశారు. తదనంతర రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు... హరికృష్ణను రాజ్యసభకు పంపారు. రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలుగులో రాజ్యసభలో ఆవేశపూరితంగా తెలుగులో ప్రసంగించారు. ముందస్తు అనుమతి లేకుండా తెలుగులో హరికృష్ణ చేసిన ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగించాలని అప్పట్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న పీజే కురియన్‌ ఆదేశించారు.

Don't Miss