ఆయన లేకున్నా..జ్నాపకాలు మనతోనే : బాలకృష్ణ

20:44 - August 29, 2018

హైదరాబాద్ : తన అన్నయ్య అందరితోను కలుపుకోలుగా ఉండేవారని తెలిపారు సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ. హరికృష్ణ మనతో లేకున్న ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉంటాయని చెప్పారు. హరికృష్ణ మృతికి సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతున్నానని బాలకృష్ణ అన్నారు. అన్నయ్య హరికృష్ణ లేకపోవడం తనకు, తమ కుటుంబానికే కాదు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు తీరని లోటని నందమూరి బాలకృష్ణ అన్నారు. మెహిదీపట్నంలో హరికృష్ణ భౌతికకాయం ఉంచిన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, హరికృష్ణ మన మధ్య లేకపోవడం చాలా బాధకరమని అన్నారు. హరికృష్ణకు బంధుప్రీతి ఎక్కువని, మా ఊరు వెళ్లినప్పుడు ప్రతిఒక్క బంధువును కలిసి, పలకరించేవారని అన్నారు. అలాగే, పార్టీలో కూడా అందరితో కలుపుగోలుతనంగా ఉండేవారని, అటువంటి ఆయన లేరంటే నమ్మబుద్ధి కావడం లేదని చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు. సంస్కృతీ సంప్రదాయాలకు హరికృష్ణ విలువ నిచ్చేవారని, తమ ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు వస్తుండేవారని, హరికృష్ణ చూస్తుంటే తండ్రిని చూస్తున్నట్టే ఉండేదని అన్నారు. అందరూ పోవాల్సిన వాళ్లేమని, కానీ, ఈవిధంగా చనిపోవడం బాధాకరంగా ఉందని, నమ్మబుద్ధి కావడంలేదని బాధాతప్త హృదయంతో బాలకృష్ణ చెప్పారు.

Don't Miss