లోక్ సభ బాటలోనే రాజ్యసభ..

14:33 - December 7, 2016

ఢిల్లీ : రాజ్యసభలో బుధవారం కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుండి పలుమార్లు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైంది. పెద్దనోట్లు రద్దుపై విపక్షాలు పలు ప్రశ్నలు సంధించారు. సోదాల్లో కొత్త నోట్లు భారీ ఎత్తున లభ్యమౌతున్నాయని, దీనిపై విచారణ చేయిస్తారా అని సుఖోయ్ ప్రశ్నించారు. ప్రధాన మంత్రి సభకు వస్తే చర్చ జరుగుతుందని తిరుచ్చి శివ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభకు వస్తారని, చర్చలో పాల్గొంటారని అధికారపక్షం పేర్కొంటోందని డిప్యూటి ఛైర్మన్ పేర్కొన్నారు. వివిధ అంశాలు..సమస్యలపై సభ్యులు లేవనెత్తడం జరిగిందని, ఇందుకు సంబంధిత శాఖలకు చెందిన మంత్రులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఎంపీ కేకే పేర్కొన్నారు. ఇందుకు ఎవరు సమాధానం చెబుతారని విపక్ష సభ్యులు అడగడం జరుగుతోందన్నారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రధాన మంత్రి నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రకటన చేయడం జరిగిందని ఆనంద్ శర్మ సభ దృష్టికి తెచ్చారు. దీనితో ప్రజలు డబ్బుల కోసం క్యూ లైన్ లో నిల్చుంటూ అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. సభలో చర్చను విపక్షాలే అడ్డుకుంటున్నాయని విమర్శించారు. తాను ప్రసంగించే సమయంలో ప్రధాని ఉండాలని సభ్యులు ఉండాలని కోరుకోవడం తగదని, ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. సభలో చర్చ జరగాలని విపక్షాలు కోరుకుంటున్నాయా ? లేదా ? అని ప్రశ్నించారు. దీనిపై సీపీఎం సభ్యుడు ఏచూరి తగిన సమాధానం చెప్పారు. అనంతరం విపక్షాలు ఆందోళన చేయడంతో డిప్యూటి ఛైర్మన్ సభను గురువారానికి వాయిదా వేశారు. 

Don't Miss