నేనంటే నేనే శీతయ్యను..

20:45 - August 29, 2018

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యులుగా ఢిల్లీలోనూ కీలక పాత్ర పోషించారు. రాజ్యసభలో తెలుగులో ప్రసంగించడం ద్వారా తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు.

నందమూరి హరికృష్ణ సినిమాల్లోనే కాదు... రాజకీయ ప్రస్థానంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్ని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు హరికృష్ణను రాజ్యసభకు పంపించారు. 2008లో ఆయన టిడిపి తరపున రాజ్యసభ పదవికి ఎన్నికయ్యారు.

హస్తిన రాజకీయాల్లోనూ హరికృష్ణ కీలక పాత్ర పోషించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ హరికృష్ణకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన తూర్పార బట్టేవారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తీరును నిరసిస్తూ రాజ్యసభలో ఆయన తెలుగులో చేసిన ప్రసంగం హైలైట్‌గా నిలిచిపోయింది. హరికృష్ణ తెలుగులో ప్రసంగించడానికి అప్పటి రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పిజె కురియన్‌ అనుమతించలేదు. తెలుగులో మాట్లాడడానికి ముందస్తు పర్మిషన్‌ తీసుకోవాల్సి ఉంటుందని కురియన్‌ అన్నారు. ఉప సభాపతి మాటలను పట్టించుకోని హరికృష్ణ తనదైన శైలిలో తెలుగులోనే ప్రసంగించారు. తాంబూలలిచ్చాం...తన్నుకు చావండి...అన్నట్లుగా తెలుగు ప్రజలను విభజించారని ఆయన సభలో మండిపడ్డారు.

రాష్ట్రవిభజనకు నిరసనగా 2013, ఆగస్టు4న రాజ్యసభ పదవికి హరికృష్ణ రాజీనామా చేశారు. తన రాజీనామాను పట్టుబట్టి ఆయన ఆమోదింపజేసుకున్నారు. టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఉంటూ కడవరకు హరికృష్ణ పార్టీ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. కొంత కాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Don't Miss