ఎపి ఉద్యోగులకు ఊరట

07:31 - December 1, 2016

విజయవాడ : ఇవాళ ఒకటో తారీఖు. ఒకటో తారీఖు కష్టాలను అధిగమించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికి ఇవాళ 10వేల రూపాయల నగదు ఇస్తామని ప్రకటించారు. పెద్ద నోట్ల లాంటి సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కోవాలంటే నగదు రహిత లావాదేవీలే పరిష్కారమన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసమే తాను బ్యాంకింగ్‌ వ్యవహారంలో జోక్యం చేసుకున్నానన్న సీఎం..చిల్లర కష్టాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలనే అన్వేషిస్తున్నామని స్పష్టం చేశారు.    
రూ.10 వేలు తీసుకునేందుకు చర్యలు 
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కారు తీపి కబురు అందించింది. ఇవాళ ఒకటో తారీఖు కావడంతో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ప్రాంతాల్లో పదివేల రూపాయలు తీసుకునేందుకు చర్యలు తీసుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రేషన్‌ షాపుల్లో డబ్బులు లేకున్నా సరుకులు కొనుకోవచ్చన్నారు. బ్యాంక్ అకౌంట్‌ లేని వారు త్వరగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని బాబు సూచించారు. 
మోడల్ డిజిటల్ వ్యవస్థ
దేశంలోనే మోడల్ డిజిటల్ వ్యవస్థను రాష్ట్రంలో రూపొందిస్తున్నామని సీం చంద్రబాబు అన్నారు. కొద్ది రోజుల క్రితం బ్యాంక్‌ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన..ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను జోక్యం చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కరెన్సీ సమస్యను అధిగమించడం కోసం బ్యాంక్‌ అధికారులు తీసుకుంటున్న  చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. 
నగదు రహిత లావాదేవీలు
కైజాలా యాప్ ద్వారా ప్రభుత్వ శాఖలన్నింటినీ సమీకృతం చేసి..ప్రభుత్వ  కార్యక్రమాలను  ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామని చంద్రబాబు అన్నారు.  నగదు రహిత లావాదేవీలే లక్ష్యంగా రాష్ట్రంలో 40 వేల 150 స్వైప్‌  మిషన్లను సరఫరా చేశామని తెలిపారు. వీటిలో  27వేల 215 యాక్టివ్‌గా ఉన్నాయని చెప్పారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి... ఇంకా 12 వేల 935 స్వైప్‌మిషన్లను  త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని బ్యాంకర్లు సీఎంకు వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్వైప్‌మిషన్లను  వినియోగించుకుంటూనే కొత్తవాటిని సమకూర్చాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రం సాంకేతికంగా ముందంజలో ఉందని...ఏది ఏమైనా సాధ్యమైనంత వరకూ నగదు రహిత లావాదేవీలను నిర్వహిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు కేంద్రం కూడా నెలజీతాల విషయంలో ఇబ్బందులు రాకుండా  పెద్దమొత్తంలో ఏటీఎంలలో..నగదును అందుబాటులో ఉంచాలని ఆర్బీఐకి సూచించింది. 

 

Don't Miss