మళ్లీ అధికారమివ్వాలన్న గులాబీ బాస్...

06:47 - September 3, 2018

హైదరాబాద్ : ప్రజల సంక్షేమానికి మరెన్నో సంక్షేమ పథకాలు చేపడతామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. నాలుగున్నరేళ్ల పాలనలో 469 సంక్షేమ పథకాలు చేపట్టామని.... 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనని హామీలను కూడా నెరవేర్చామన్నారు. మరోసారి ప్రజలు దీవిస్తే బంగారు రాష్ట్రాన్ని తెలంగాణ చేస్తామన్నారు గులాబీ దళపతి. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు 2000 సంవత్సరంలోనే బీజం పడిందన్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. తెలంగాణ వస్తే ఏం చేయాలనే ఆలోచనలు జయశంకర్‌ సార్‌తో కలిసి 2006-07లోనే చేశామన్నారు. అప్పటి ఆలోచనల ఫలితమే నేటి సంక్షేమ పథకాలన్నారు. ఆర్థిక ప్రగతిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు సీఎం.

14 ఏళ్ల కఠోర శ్రమ అనంతరం తెలంగాణ సాధించుకున్నామన్నారు సీఎం. వేరే వారితో కలిసే వెళ్తే కష్టపడి సాధించుకున్న తెలంగాణకు న్యాయం జరగదనే అభిప్రాయంతో 2014 ఎన్నికలకు ఒంటరిగా వెళ్లామన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని ఎంతోమంది శాపనార్దాలు పెట్టారు. కానీ.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే విద్యుత్‌ కష్టాలు తొలిగించామన్నారు. దేశంలో రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు కేసీఆర్‌.

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు సీఎం. అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేతివృత్తుల వారికి ఎన్నో పథకాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో అందరికీ కేజీ నుండి పీజీ విద్య అందిస్తామన్నారు కేసీఆర్‌. ఎన్నో ఏళ్లుగా అన్యాయానికి గురైన గిరిజనుల గురించి ఆలోచించి.. గిరిజన తండాలను పంచాయతీలు మార్చామన్నారు కేసీఆర్‌. తెలంగాణకు శాశ్వత ఆదాయం వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు కేసీఆర్‌. త్వరలోనే కోటి ఎకరాలను ఆకుపచ్చగా మార్చి చూపిస్తామన్నారు సీఎం. .

ఇప్పటికే 22 వేల గ్రామాలకు నీళ్లు అందించామని.. మరో ఆరేడు రోజుల్లో మరో 1300 గ్రామాలకు నీళ్లు అందిస్తామన్నారు కేసీఆర్‌. రైతులకు గురించి ఆలోచించి రుణమాపీ చేశామని.. రైతుబంధు పథకం ప్రవేశపెట్టామన్నారు. నవంబర్‌లో రెండో విడత రైతుబంధు చెక్కులు అందజేస్తామన్నారు ఇసుకపై కాంగ్రెస్‌ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఇసుకపై ఆదాయం 10 కోట్ల రూపాయలు వస్తే.. నాలుగున్నరేళ్ల పాలనలో... 1980 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. మళ్లీ టీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే... రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామన్నారు స్పష్టం చేశారు కేసీఆర్‌. ప్రజల దీవెనలతో మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గులాబీ దళపతి.

కొంగరకలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభకు జనం భారీగా తరలిరావడంతో సీఎం కేసీఆర్‌ ఉప్పొంగి పోయారు. సభ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో హెలిక్యాప్టర్‌లోంచి ప్రజలకు అభివాదం చెప్పారు. 

Don't Miss