జిఎస్‌టి కౌన్సిల్ కీలక నిర్ణయం

20:39 - November 10, 2017

ఢిల్లీ : జిఎస్‌టి 28 శాతం పరిధిలో ఉన్న 177 వస్తువుల టాక్స్‌ తగ్గిస్తూ జిఎస్‌టి కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. శానిటరి, సూట్‌కేస్‌, వాల్‌ పేపర్స్‌, ప్లయివుడ్‌, స్టేషనరి, చ్యూయింగ్ గమ్స్, ఆఫ్టర్ షేవ్ కిట్స్, డియెడరెంట్, వాషింగ్ పౌడర్, డిటెర్జెంట్, మార్బుల్‌ తదితర వస్తువులపై 18 శాతం మాత్రమే పన్ను ఉంటుందని బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ వెల్లడించారు. సామాన్యులు వాడే అన్ని రకాల వస్తువులను 28 శాతం పరిధి నుంచి తప్పించినట్లు ఆయన తెలిపారు.  28 శాతం స్లాబ్‌లో గతంలో 227 వస్తువులు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 50కి తగ్గింది. అంటే 177 వస్తువులపై పన్ను భారం తగ్గింది. దీంతో 20 వేల కోట్ల మేర నష్టం వాటిల్లనుందని మోది పేర్కొన్నారు. జీఎస్టీ అమలుకు సంబంధించిన అంశాలను పరిశీలించడానికి వేసిన ఐదుగురు సభ్యుల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌కు సుశీల్‌ కుమార్‌ మోదీ నేతృత్వం వహిస్తున్నారు. వాషింగ్‌ మిషన్, ఫ్రిజ్‌ తదితర లగ్జరీ గూడ్స్, టొబాకో, సిగరెట్లను 28 శాతం పన్ను పరిధిలోనే ఉన్నాయి. నిత్యావసర వస్తువులపై పన్ను అధికంగా పెరగడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

 

Don't Miss