బల్దియా బడ్జెట్ కు ఆమోదం..

21:04 - December 3, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొషన్‌ స్టాడింగ్‌ కమిటీ 2017/18 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. బల్దియా చరిత్రలో మొదటిసారి అధికారులు ప్రతిపాదించిన బడ్జెట్‌కు ప్రజాప్రతినిధులు ఒకే చెప్పారు. అంకెల గార‌డి చేయకుండా గతేడాది కంటే కేవలం 43కోట్లు పెంచి 5వేల 643కోట్లగా బడ్జెట్ రూపొందించారు.

జీహెచ్ఎంసీ 2017 - 18 బడ్జెట్ రూ.5643 కోట్లు
జీహెచ్ఎంసీ 2017-18 సంవత్సరానికిగానూ 5 వేల 643 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను బల్దియా పాలక మండలి ఆమోదించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు రూపొందించిన బడ్జెట్ కే పాలక మండలి ఒకే చెప్పింది. ఇక 2016- 17 కు 5వేల 600కోట్ల బడ్టెట్ ప్రతి పాదించ‌గా, ఈ సారి కేవ‌లం 43కోట్లు మాత్రమే పెంచిన అధికారులు 5 వేల 643కోట్లకు ఫిక్స్ చేశారు. గ‌త బ‌డ్జెట్ లో డ‌బుల్ బెడ్ రూంకూ ప్రాధాన్యతనిచ్చిన అధికారులు ఈ సారి రోడ్ల పై దృష్టి సారించారు. అత్యధికంగా 29 శాతం నిధుల‌ను రోడ్డపై ఖ‌ర్చు చెయ్యాల‌ని నిర్ణయించిన అధికారులు వెయ్యి 611కోట్ల రూపాయ‌ల‌ను ఇందు కోసం కేటాయిస్తూ ప్రతిపాదించారు. వీటిలో ఎస్ ఆర్టీపీ, వైట్ టాంపింగ్ రోడ్లతో పాటు జంక్షన్ల విస్తర‌ణ‌పై ఫోక‌స్ చేశారు.

రెవిన్యూ వ‌సూలు 2926.82కోట్లు
ఇక‌ ఏడాది బల్దియా బడ్జెట్ ముసాయిదాలో ఒకటైన రెవిన్యూ రాబడి 2 వేల 926 కోట్లు వ‌స్తుంద‌ని భావించిన అధికారులు 2 వేల 616 కోట్లు ఖ‌ర్చు చెయ్యాలని ప్రతిపాదించారు. ఇందులో 310 కోట్లు మిగులు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. ఆస్తి ప‌న్ను వల్ల వెయ్యి 285 కోట్లు ఆదాయం వ‌స్తుంద‌ని అంచ‌నా వేసిన అధికారులు.. ఫీజులు, ట్రేడ్ లైసెన్స్, ప్రక‌ట‌న‌ల ఫీజు, రోడ్డు క‌ట్టింగ్ ఫిజులు భ‌వ‌న‌ నిర్మాణ అనుమ‌తుల వంటి యూజ‌ర్ ఛార్జీల ద్వారా 962 కోట్ల 79 లక్షలు వ‌స్తుందని అంచ‌నా వేశారు. బ్యాంకు డిపాజిట్ల వ‌డ్డీల ద్వారా 30కోట్లు, భ‌వ‌నాలు, స్థలాల లీజు ద్వారా 17కోట్లు వ‌స్తుందని అంచనా వేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా క‌చ్ఛితంగా రావాల్సిన 583కోట్ల నిధులను అంచ‌నా వేస్తున్నారు.

క్యాపిట‌ల్ రిసిప్ట్స్ 3,026.73కోట్లు
ఇక క్యాపిటల్ ఇన్ కమ్‌ 3వేల 26 కోట్ల 73 లక్షలు కాగా దానిని పూర్తి స్థాయిలో ఖ‌ర్చు చేసేలా ప్లాన్ రూపోందించారు. క్యాపిట‌ల్ రాబ‌డిలో అప్పుల‌పైనే న‌మ్మకం పెట్టుకుంది బ‌ల్దియా. 2 వేల 240కోట్లను అప్పుల రూపంలో స‌మీక‌రించేందుకు సిద్ధమ‌య్యారు. ఇప్పటికే ప్రయివేటు ఏజెన్సీతో రెటింగ్ ఫిక్స్ చేయించుకుంటున్న బ‌ల్దియా, మూడేళ్లలో 3 వేల 300కోట్లు అప్పుచేసేందుకు రెడీ అయ్యింది. వీటిలో మొద‌టి ఏడాది 2వేల 240కోట్ల అప్పుకు సిద్ధమయ్యింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నుల భారం ఉండదని సంకేతాలు
ఇక ఈ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నుల భారం ఉండదని సంకేతాలు ఇస్తున్నాయి గ్రేటర్ వర్గాలు. ఆస్తి పన్ను లెక్కింపులో ఉన్న లోపాలు సవరించడం ద్వారా ఇప్పటికి పన్ను పరిధిలోకి రాని వేలాది ఆస్తుల నుండి పన్నులు వసూలు చెయ్యడం ద్వారా రాబడి పెంచుతామంటున్నారు. ఇక పాపర్టీ ఎలివేషన్ కోసం ఖర్చుచేయ్యాల్సిన నిధులను వారి కోసమే ఖర్చుచేస్తామన్నారు కమీషనర్

ప్రభుత్వం గ్రాంట్లతోపాటు అప్పుల రూపంలోనూ సేకరించాలని నిర్ణయం
ఇక క్యాపిటర్ ఎక్పెండెచర్ లో ప్రభుత్వం నుండి వచ్చేగ్రాంట్లతోపాటు అప్పుల రూపంలో కూడా సేకరించాలని డిసైడయ్యారు అధికారులు. అయితే గడిచిన రెండేళ్లుగా ప్రభుత్వం నుండి నామమాత్రంగానే ఆర్థిక సహయం అందింది. ఈ ఏడాది అయినా బల్దియాకు బాసటగా ఉంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

 

Don't Miss