స్వచ్ఛ్ హైదరాబాద్ కసరత్తులు..

09:46 - December 7, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ను స్వచ్ఛ హైదరాబాద్‌గా మార్చడానికి బల్దియా అన్ని రకాలుగా ప్లాన్ చేస్తోంది. తడి, పొడి చెత్తను వేరు చెయ్యడంతో పాటు పొడి చెత్తను పూర్తిగా రిసైకిల్ చెయ్యడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్ అందాలను కాపాడేందుకు అసరమైతే కఠినమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

గ్రేటర్‌లో పారిశుద్ద్యాన్ని పెంచడానికి జీహెచ్ఎంసీ కసరత్తు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుద్ద్యాన్ని పెంచడానికి జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. ఏడాదిన్నర క్రితం నిర్వహించిన స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమం కొనసాగింపుగా స్పెషల్ ప్రోగామ్స్‌తో స్వచ్ఛ్ భారత్ సర్వేక్షన్ ర్యాంకింగ్ లో మెరుగైన స్ధానం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి జనవరి 12 వరకు స్పెషల్ ప్రోగ్రాం డిజైన్ చేసింది.

స్వచ్ఛ్ హైదరాబాద్‌లో అన్ని వర్గాల భాగస్వామ్యం : మేయర్
హైదరాబాద్ నగరాన్ని స్వచ్చ్ సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాలు, స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆర్గనైజెషన్స్‌ను సచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. శాస్త్రీయ పద్దతిలో వేరుచేసిన పొడి చెత్తను కొనుగోలు చేయడానికి ఐటీసీ కంపెనీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రైవేటు సంస్థలు కూడా స్వచ్ఛ్ హైదరాబాద్‌కు సహకరిస్తున్నాయన్నారు. దీంతో చెత్త సేకరణపై ఆధారపడ్డవారికి ఆదాయం కూడా సమకూరుతుందన్నారు.

హైదరాబాద్ అందాలను మరింతగా పెంచేలా చర్యలు
హైదరాబాద్ అందాలను మరింతగా పెంచేలా చర్యలు తీసుకోవడంతో పాటు విచ్చలవిడిగా వెలుస్తున్న ప్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగ్స్ లను తొలగిస్తామని బల్దియా కమిషనర్ జనార్దన్ రెడ్డి అన్నారు. జనవరి 1వ తేదీ నుంచి గోడలపై రాతలు, పోస్టర్లు వెయ్యడాన్ని నిషేధిస్తామని డిఫేస్ మెంట్ యాక్ట్ ప్రకారం ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. విజిలెన్స్ కోసం డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో మెడికల్ అధికారులు, అసిస్టెంట్ సిటి ప్లానర్, శానిటరీ సూపర్ వైజర్లతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన మొబైల్ కోర్టు ద్వారా నగరంలో బహిరంగ స్థలాల్లో చెత్త వేయడం, మలమూత్ర విసర్జన చేసేవారిని గుర్తించడం, ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలను నిర్వహించేవారిని గుర్తించి అక్కడికక్కడే జరిమానాలు విధించడం ద్వారా సిటీలో పారిశుద్ద్యాన్ని రక్షిస్తామంటుంది బల్దియా..

 

Don't Miss