జగ్గారెడ్డి అరెస్టు...

06:17 - September 11, 2018

సంగారెడ్డి : మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో పాస్ పోర్టు, వీసా పొందారనే ఆరోపణలతో జగ్గారెడ్డిని పటన్ చెరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ పాస్ పోర్టుతో మనుషులను అక్రమ రవాణా చేసినట్లు జగ్గారెడ్డిపై ఆరోపణలున్నాయి. దీనిపై ఆయన సతీమణి నిర్మల స్పందించారు. తన భర్త పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడకు తీసుకెళుతున్నారో కూడా పోలీసులు చెప్పడం లేదని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తన భర్తపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. తన భర్త జగ్గారెడ్డి ప్రాణానికి ముప్పు ఉందన్నారు. 

2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబానికి నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి.. అమెరికాకు తీసుకెళ్లారనే అభియోగాలతో అదుపులోకి తీసుకున్నారు. అయితే.. జగ్గారెడ్డి తీసుకెళ్లినవారు 14 ఏళ్లు అయినా.. ఇంకా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన అమెరికా కాన్సులేట్‌ అధికారులు ఈ విషయంపై ఆరా తీయాలంటూ నార్త్‌జోన్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులు.. జగ్గారెడ్డి 2004లో తన సిఫారసుతో ఇప్పించిన పాస్‌పోర్టుల డాక్యుమెంట్లను పరిశీలించారు. దీంతో... అందులో భార్య, కూతురు, కొడుకు పేర్లు ఉన్నా ఫొటోలు వేరేవిగా గుర్తించారు. 

Don't Miss