కామ్రేడ్ కాస్ట్రో! రెడ్ సెల్యూట్..

22:33 - December 3, 2016

క్యూబా : విప్లవవీరుడు ఫిడెల్ కాస్ట్రో చితాభస్మానికి వీడ్కోలు పలుకడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాస్ట్రో చితాభస్మాన్ని ప్రజలు పెద్దఎత్తున సందర్శించారు. ఆయన చితాభస్మానికి శాంటియాగాలో రేపు సమాధి చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు హాజరు కానున్నారు.

కాస్ట్రో భౌతిక కాయానికి నవంబర్‌ 27న దహన సంస్కారాలు
క్యూబా విప్లవవీరుడు ఫిడెల్ కాస్ట్రో భౌతిక కాయానికి గత ఆదివారం నవంబర్‌ 27న దహన సంస్కారాలు నిర్వహించారు. కాస్ట్రో రాసుకున్న విల్లు మేరకే ఆయన మృతదేహాన్ని దహనం చేశారు.

చరిత్రాత్మక విప్లవ కూడలిలోని జోస్ మార్టిన్ స్మారక కేంద్రంలో చితాభస్మం
కాస్ట్రో చితాభస్మం ఉన్న పాత్రను ఒక అద్దాలపెట్టెలో ఉంచి, దానిపై క్యూబా జాతీయ జెండాను కప్పారు. కాస్ట్రో చితా భస్మాన్ని గ్రీన్‌ మిలటరీ వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రజల సందర్శనార్ధం రెండు రోజుల పాటు హవానాలోని చరిత్రాత్మక విప్లవ కూడలిలోని జోస్ మార్టిన్ స్మారక కేంద్రంలో ఉంచారు. అక్కడికి పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు శోకతప్త హృదయంతో తమ ప్రియతమ నేతకు శ్రద్ధాంజలి ఘటించారు.

హవానాలో రెండురోజుల శ్రద్ధాంజలి అనంతరం కాస్ట్రో చితాభస్మం ఊరేగింపు
హవానాలో రెండురోజుల శ్రద్ధాంజలి అనంతరం కాస్ట్రో చితాభస్మం ఊరేగింపు బుధవారం నుంచి ప్రారంభమైంది. వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన క్యూబన్లు తమ నేతకు వీడ్కోలు పలికారు. నేనే ఫిడెల్ అంటూ నినాదాలు చేశారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆ చితాభస్మం శాంటాక్లారాలోని ఆయన ఉద్యమ సహచరుడు చెగువెరా సమాధి మ్యూజియం ఉన్న సముదాయంలోకి చేరింది. ఇది క్యూబాతోపాటు మానవాళి చరిత్రను మార్చివేసిన ఇద్దరు విప్లవ వీరుల చారిత్రక సమావేశం అని ఓ వైద్య విద్యార్థి వ్యాఖ్యానించారు.

కాస్ట్రో చితాభస్మం ఊరేగింపు ప్రస్థానం
కాస్ట్రో చితాభస్మం ఊరేగింపు హవానా నుంచి పలు పట్టణాల మీదుగా నాలుగు రోజుల పాటు 8 వందల కిలోమీటర్ల మేర ప్రయాణించి డిసెంబర్‌ 4, ఆదివారం శాంటియాగోకు చేరుకుంటుంది. శాంటాఐఫిజెనియా స్మశానవాటికలో చితాభస్మాన్ని ఖననం చేయనున్నట్లు క్యూబా ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ 19వ శతాబ్దపు స్వాతంత్య్ర వీరుడు జోస్ మార్టి సమాధి పక్కన కాస్ట్రో చితాభస్మాన్ని సమాధి చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధి నేతలు, అధికారులు హాజరుకానున్నారు.

2006లో అధికారాన్ని సోదరుడు రౌల్ కాస్ట్రోకు అప్పగింత
అమెరికా మద్దతుతో విర్రవీగిన క్యూబా నియంత ఫుల్జెన్సియో బాస్టియాను విప్లవోద్యమం ద్వారా కాస్ట్రో ఆయనను గద్దె దించారు. అమెరికా చేసిన హత్యాయత్నాలను కుట్రలను, విజయవంతంగా ఛేదిస్తూ 1959 నుంచి దాదాపు 50 ఏళ్ల పాటు క్యూబాను పరిపాలించారు. అనారోగ్యంతో 2006లో అధికారాన్ని తనకు విశ్వాసపాత్రుడైన సోదరుడు రౌల్ కాస్ట్రోకు అప్పగించి దేశ పాలనా వ్యవహారాలను చక్కదిద్దుతూ వచ్చారు. నవంబర్‌ 26న 90 ఏళ్ల కాస్ట్రో తుది శ్వాస విడిచారు.

Don't Miss