కూరగాయలు..'చిల్లర' చింత..

17:41 - December 7, 2016

నిజామాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో నిజామాబాద్‌ జిల్లాలో కురగాయల రైతుల పై తీవ్ర ప్రభావం పడింది. కొత్త నోట్లకు సరిపడ చిల్లర లేకపొవటంతో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయని వ్యాపారులు అంటుంటే.. పెట్టుబడులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. చిల్లర కష్టాలతో నిజామాబాద్‌ జిల్లా రైతులు, కూరగాయల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. అమ్మకాల్లేక కూరగాయల మార్కెట్లు వెలవెలబోతున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను నడుపుకునే వారికి పెద్ద నోట్ల రద్దు చాలా ఇబ్బందికరంగా మారింది. తాము పండించిన కూరగాయాలను ఏమి చేయలో తెలియక..తక్కువ ధరకే వ్యాపారులకు అప్పగిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. అసలే గత రెండు సంవత్సరాలుగా తీవ్ర వర్షాభావంతో పంటలు సరిగా చేతికి రాలేదు. ఈ సంవత్సరం వర్షాలు బాగాపడటంతో నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా చెరువులు కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో రైతులు విస్తృతంగా కూరగాయలను సాగు చేసారు. అయితే.. నవంబరు8న కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేయడంతో తాము పూర్తిగా నష్టపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నష్టాల పాలు..
పెద్దనోట్ల రద్దు రైతులనే కాదు.. కూరగాయల వ్యాపారులను కూడా నష్టాల పాలు చేసింది. చిల్లర లేకపోవడంతో పండించిన కూరగాయాలను తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోందని చిరు వ్యాపారులు వాపోతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన 2వేల రూపాయల నోటుతోనే అసలు సమస్య వచ్చిందంటున్నారు. జిల్లా అధికారులు మాత్రం ..పైసలతో పనిలేకుండా వ్యాపారం చేయడానికి స్వైప్‌ మిషన్లు ఇస్తామంటున్నా వాటితో పెద్దగా ఉపయోగం లేదంటున్నారు వ్యాపారులు. పెద్దనోట్లకు సరిపడా 50, 20 రూపాయల నోట్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంకెంతకాలం ఈ చిల్లర సమస్యతో అమ్మకాలు బంద్‌ అవుతాయోనని చిరువ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా చిల్లర సమస్యను పరిష్కరించి తమను ఆదుకోవాలని రైతులు, కూరగాయల ప్యాపారులు కోరుతున్నారు. 

Don't Miss