బదులు తీర్చుకుంటుందా?

21:29 - December 6, 2016

చెన్నై : భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య సిరీస్‌ నిర్ణయాత్మక నాలుగో టెస్ట్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. తొలి టెస్ట్‌లో డ్రాతోనే సరిపెట్టుకున్న విరాట్‌ ఆర్మీ వైజాగ్‌, మొహాలీ టెస్ట్‌ల్లో నెగ్గి ఆధిక్యంలో నిలిచింది. ముంబై టెస్ట్‌లోనూ నెగ్గి సిరీస్‌ విజయం సాదించాలని కొహ్లీ అండ్‌ కో పట్టుదలతో ఉంది. ట్రెడిషనల్‌ టెస్ట్ ఫార్మాట్‌లో ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌..5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోని సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌కు ముంబైలో వాంఖడే స్డేడియంలో రంగం సిద్ధమైంది. రాజ్‌ కోట్‌ టెస్ట్‌లో పోరాడి డ్రాగా ముగించిన కొహ్లీ సేనకు ఆ తర్వాతి రెండు టెస్టుల్లో తిరుగేలేకుండా పోయింది. వైజాగ్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించిన విరాట్‌ ఆర్మీ...మొహాలీ టెస్ట్‌ను నాలుగు రోజుల్లోనే నెగ్గి 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఇంగ్లండ్ 43 మ్యాచ్ ల్లో విజయం..
నాలుగో టెస్ట్‌లోనూ నెగ్గి సిరీస్‌ సొంతం చేసుకోవాలని టీమిండియా తహతహలాడుతుండగా జోరు మీదున్న విరాట్‌ ఆర్మీకి ఎలా అయినా చెక్‌ పెట్టాలని కుక్‌ అండ్‌ కో పట్టుదలతో ఉంది. ప్రస్తుత సిరీస్‌లో తేలిపోతున్న ఇంగ్లండ్‌ జట్టు...ట్రెడిషనల్‌ టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం భారత జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించిన జట్లలో ముందు వరుసలో ఉంది. భారత గడ్డపై సైతం ఇంగ్లీష్ టీమ్‌కు టెస్టుల్లో మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఓవరాల్‌గా టెస్టుల్లో ఇరు జట్ల మధ్య ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో ఇంగ్లండ్‌దే పై చేయిగా ఉంది. మొహాలీ టెస్ట్‌ వరకూ భారత్‌-ఇంగ్లండ్ జట్లు ఇప్పటివరకూ 115 టెస్టుల్లో పోటీపడగా ఇంగ్లండ్‌ జట్టు 43 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, భారత్‌ 23 టెస్టుల్లో మాత్రమే నెగ్గింది.

భారత్ నెగ్గుతుందా ?
సొంత గడ్డపై టెస్టుల్లో తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ కలిగిన భారత్‌పై గత పదేళ్లలో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గిన ఏకైక జట్టు ఇంగ్లండ్‌ మాత్రమే. తొలి టెస్ట్‌లో భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లీష్‌ టీమ్‌ ఆ తర్వాతి రెండు టెస్ట్‌ల్లో మాత్రం తేలిపోయింది. దీంతో సిరీస్‌కే నిర్ణయాత్మకంగా మారిన ముంబై టెస్ట్‌లో అంచనాలకు మించి రాణించాలని ఇంగ్లీష్‌ టీమ్‌ ప్లాన్‌లో ఉంది. మరి టెస్టుల్లో గత 16 టెస్టుల్లో ఓటమంటూ లేని టీమిండియా...ఇంగ్లండ్‌పై సిరీస్‌ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ముంబై టెస్ట్‌లో నెగ్గి కొహ్లీ అండ్‌ కో ఇంగ్లండ్‌పై బదులు తీర్చుకుంటుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

Don't Miss