ఫేస్‌బుక్‌లో కిడ్నీల వ్యాపారం...గుట్టురట్టు

08:40 - December 1, 2016

మహబూబ్ నగర్ : ఫేస్‌బుక్‌లో కిడ్నీల వ్యాపారం మొదలుపెట్టాడో మోసగాడు..దీనికి దానం చేస్తున్నామంటూ బిల్డప్ ఇచ్చాడు..అమాయకులను బుట్టలో వేసుకుని వారి కిడ్నీలను లక్షలకు విక్రయించేందుకు బేరం పెట్టాడు..ఇలా పాలమూరు కుర్రాడు లైన్లోకి రాగానే ఆశలు పెట్టి మోసం చేయబోయాడు. చివరకు దొరికిపోయాడు.
కిడ్నీ దానం చేసేవారితో చాటింగ్‌...
ఇతనే ఆ నకిలీ డాక్టర్‌ హనీఫ్‌షాన్...అనంతపురం జిల్లా గుంతకల్లు చెందిన హనీఫ్‌ డబ్బు సంపాదించేందుకు రకరకాల వేషాలేస్తాడు. అందులో ఒకటి ఈ వైద్యుడి అవతారం. తనకు తాను మూత్రపిండాల డాక్టర్‌గా పరిచయం చేసుకుంటూ ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ ఓపెన్ చేశాడు.. అందులో కిడ్నీలు కావాలంటూ చేసే పోస్టులు ఎక్కువ...ఎవరైనా లైన్లోకి వచ్చారంటే వారితో చాటింగ్....డబ్బుకు ఆశపడేవారే టార్గెట్...చాటింగ్‌లోకి వచ్చారంటే చీటింగే...పాలమూరు కుర్రాడికి గాలం...
బయటపడ్డ హనీఫా బాగోతం...
కిడ్నీలు దానం చేస్తే లక్షల్లో సొమ్ము వస్తుందని ఆశపెడతాడు...హనీఫా చెప్పే మాటలకు బోల్తా కొట్టేవారు అతన్ని కలిసేలా చేస్తాడు...అంతకు ముందే వారితో కొన్ని డాక్యుమెంట్లు సిద్దం చేసుకునేందుకు డబ్బు కావాలంటూ ఖాతాలో జమ చేయించుకుంటాడు.. ఇలా పాలమూరు వల్లభనగర్ చెందిన కిరణ్‌కుమార్ హనీఫా బుట్టలో పడ్డాడు...లక్షల్లో వస్తుందని ఆశించాడు.
కిడ్నీ దానం చేసేందుకు సిద్ధం 
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో వల్లభనగర్‌కు చెందిన కిరణ్‌కుమార్‌ ఫేస్‌ బుక్‌ ద్వారా హనీఫ్‌సాన్‌ ను సంప్రదించాడు. లక్షల్లో సోమ్ము వస్తుందని చెప్పడంతో తన మూత్రపిండాన్ని దానం చేసేందుకు సిద్ధమయ్యాడు. వైజాగ్‌లో ఉద్యోగ శిక్షణ వెళ్తున్నట్లు కన్నవారిని నమ్మించిన కిరణ్‌ పదివేలు ఖర్చుల కోసం తీసుకుని ఈ నెల 24న తిరుపతి బయల్దేరాడు. ఇంట్లో ఫోన్ మర్చిపోవడంతో ఆ నంబర్ ఆధారంగా పేరెంట్స్‌ ఫోన్ చేస్తే అసలు కథ తెలిసింది. అయితే కిరణ్‌ కిడ్నీ తీసుకోకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలని హనీఫా డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు గుట్టురట్టయింది. హనీఫాలాంటి వారెందరో ఫేస్‌బుక్ ఆధారంగా మోసాలు చేస్తూనే ఉన్నారు. ఆశలెన్నో కల్పించి పుట్టిముంచేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్తా...

Don't Miss