హానెస్ట్ 'జేడీ'లక్ష్మీనారాయణ స్పెషాలిటీ!..

21:15 - August 21, 2018

విజయవాడ : సీబీఐ మాజీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ.. రాజకీయరంగ ప్రవేశం ఖరారైందా..? ఎన్నికల సమారంగణంలోకి దూకేందుకు లక్ష్మీనారాయణ వేదికను ఎంచుకున్నారా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. అసలు ఆయన ఏ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి వస్తున్నారు..? అందులో ఆయనకు దక్కనున్న స్థానం ఏంటి..? ఈ వివరాలు తెలుసుకునేముందు.. లక్ష్మీనారాయణ గురించిన కొన్ని వివరాలు...!

డ్యూటీలో హోదానే ఇంటిపేరుగా స్థిరపరచుకున్న లక్ష్మీనారాయణ
జేడీ లక్ష్మీనారాయణ..! సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ హోదాలో... సంచలన కేసుల దర్యాప్తులో తనదైన ముద్ర వేసుకున్న స్ట్రిక్ట్‌ ఐపీఎస్‌ అధికారి. విధుల్లో భాగంగా తాను నిర్వహించిన హోదానే.. ఇంటిపేరుగా స్థిరపడేలా పనిచేసుకున్నారాయన. 2006 నుంచి సీబీఐ హైదరాబాద్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు.. జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసును ఆయనే దర్యాప్తు చేశారు. ఓబుళాపురం గనుల అక్రమ మైనింగ్‌కేసు దర్యాప్తూ లక్ష్మీనారాయణ బృందమే చేసింది.

ఫోక్స్‌ వ్యాగన్‌, ఔటర్‌రింగ్‌రోడ్డు,సత్యం కంప్యూటర్స్‌,ఓఎంసీ జగన్‌ ఆస్తుల కేసుల దర్యాప్తు
లక్ష్మీనారాయణ కర్నూలు జిల్లాకు చెందిన వారు. శ్రీశైలంలో జన్మించారు. మహారాష్ట్ర క్యాడర్‌లో డీఐజీగా కొనసాగుతూ.. సొంత రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చారు. తొలినాళ్లలో ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు.. ఔటర్‌ రింగ్‌రోడ్డు భూసేకరణలో అక్రమాల కేసులను దర్యాప్తు చేశారాయన. అదే సమయంలో సత్యం కంప్యూటర్స్‌ కేసునూ సమగ్రంగా దర్యాప్తు చేశారు. ఏడువేల కోట్ల రూపాయల స్కామ్‌కు చెందిన ఈ కేసు దర్యాప్తు.. లక్ష్మీనారాయణ పేరును దేశవ్యాప్తంగా మార్మోగేలా చేసింది. ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేలోపే.. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ కేసు... జగన్‌ ఆస్తుల కేసు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులు నమోదయ్యాయి. వీటినీ లక్ష్మీనారాయణే దర్యాప్తు చేశారు.

గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ వ్యవహారంపై దర్యాప్తు
ఓఎంసీ కేసులో.. గాలి జనార్దనరెడ్డి న్యాయవ్యవస్థను లోబరచుకునే ప్రయత్నం చేశారన్న విషయాన్నీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోనే బయటపెట్టారు. అప్పట్లో సీబీఐ ఇచ్చిన సమాచారంతో రాష్ట్ర ఏసీబీ అధికారులు ఇద్దరు జడ్జీలను, ఒక మాజీ న్యాయమూర్తిని అరెస్టు చేశారు. ఇది కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కర్ణాటకలో రాజకీయంగా దుమారం రేపిన గనుల కుంభకోణానికి సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై నమోదయిన కేసు దర్యాప్తు కూడా లక్ష్మీనారాయణే పర్యవేక్షించారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంపైనా ఆయన విచారణ జరిపారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్‌ అలియాస్‌ ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ కేసు కూడా లక్ష్మీనారాయణే దర్యాప్తు జరిపారు

విద్యార్థుల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు
విధుల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న లక్ష్మీనారాయణ.. విద్యార్థులను చైతన్యపరిచే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రతిచోటా విద్యార్థులను ఉత్తేజపరిచేవారు. సీబీఐలో డిప్యూటేషన్‌ పూర్తికాగానే.. లక్ష్మీనారాయణ.. మహారాష్ట్రకు తిరిగి వెళ్లిపోయారు. అయితే.. అనూహ్యంగా.. ఈఏడాది మార్చి నెలలో ఆయన వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నారు. దీంతో... ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై జోరుగా ఊహాగానాలు సాగాయి. కానీ.. ఆయన రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపకుండా.. రాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. ముఖ్యంగా రైతాంగ సమస్యల అధ్యయనంలో ఆయన.. గ్రామగ్రామాన పర్యటించారు.

రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక కోసం సమాయత్తం..!
రాష్ట్ర పర్యటనను దాదాపుగా ముగించుకున్న లక్ష్మీనారాయణ.. ఇప్పుడిక రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు సమాయత్తమైనట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకే చెందిన ఓ ప్రముఖుడు స్థాపించిన పార్టీ తరఫున ఎన్నికల సమరాంగణంలోకి దూకాలని లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ కూడా.. లక్ష్మీనారాయణనే సీఎం అభ్యర్థిగా తెరపైకి తెస్తోందని సమాచారం. 

Don't Miss