తాగునీరు...'భగీరథ' ప్రయత్నం

13:59 - April 21, 2017

హైదరాబాద్ : మరికొద్ది రోజుల్లో హైదరాబాద్‌ వాసులకు తాగునీటి కష్టాలు తీరనున్నాయని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడితే నగరంలో ప్రతిరోజు నీటిని సరఫరా చేస్తామని కేటీఆర్‌ ప్రకటించారు.  
నాలుగు రిజర్వాయర్లు ప్రారంభం 
హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై అండ్‌ సివరేజ్‌ బోర్డు నిర్మించిన నాలుగు రిజర్వాయర్లను మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ రిజర్వాయర్లను మెగా ఇంజనీరింగ్‌ సంస్థ కేవలం 11 నెలల వ్యవధిలో నిర్మించింది. ప్రజలకు నీటి కొరతను తీర్చాలనే లక్ష్యంతో కూకట్‌పల్లి...మియాపూర్‌, నల్లగండ్ల, గోపాన్‌పల్లి ప్రాంతాల్లో నాలుగు రిజర్వాయర్లను నిర్మించారు. నగర శివారు ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు రూ.1900 కోట్లతో 56 రిజర్వాయర్లు నిర్మించేందుకు వాటర్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.
నగరవాసులకు మిషన్ భగీరథ ఫలితాలు : కేటీఆర్ 
మిషన్‌ భగీరథ తొలి ఫలితాలు నగరవాసులకు అందుతున్నాయని మంత్రి కేటీఆర్‌  అన్నారు. నగరంలో తాగునీటి సమస్యను తొలగించేందుకు మరో 42 రిజర్వాయర్లను అందుబాటులోకి తెస్తామని..అన్నారు. ఆగస్టు నాటికి 10 రిజర్వాయర్లు ఉపయోగంలోకి తీసుకువస్తామన్నారు. జనాభా ఐదు రెట్లు పెరిగినా నీటికి ఇబ్బందులు ఉండకుండా తమ ప్రభుత్వం ప్లాన్‌ చేస్తుందన్నారు. ఈ మేరకు శామీర్‌ పేట్‌ ప్రాంతంలో 20 టీఎంసీల సామర్థ్యం గల భారీ రిజర్వాయర్‌ను 7వేల 700 కోట్లతో నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నామన్నారు. అలాగే ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న 168 గ్రామాలకు కూడా నీటిని సరఫరా చేస్తామని అందుకోసం రూ.628 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. 
అన్ని కుటుంబాలకు నల్లా కనెక్షన్లు : కేటీఆర్ 
అన్ని కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఉండాల్సిన అవసరం ఉందని.. ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి మరీ  ప్రభుత్వం నల్లా కనెక్షన్లు ఇస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అలాగే నాలాలు.. చెరువుల కబ్జాలపై కఠినంగా ఉంటామన్నారు. నాలాలపై నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ అన్నారు.   

 

Don't Miss