ఈ కార్స్ రన్స్..పొల్యూషన్స్ కు 'టాటా'..

12:59 - September 1, 2018

విశాఖపట్నం : కాలుష్యం, పెట్రో ధరల సమస్యను అధిగమించే దిశగా అడుగులేస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఇందుకోసం ఎలక్ట్రిక్ కార్ల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. విడతల వారీగా అన్ని ప్రభుత్వ సంస్థలకు ఎలక్ట్రిక్ కార్లను అందించనున్నారు. తొలి విడతగా విశాఖ రోడ్లపై ఈ-కార్లు పరుగులు తీయనున్నాయి.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, కాలుష్యం సమస్యలకు -కార్లతో చెక్‌
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయని బాధపడాల్సిన పనిలేదు. వాటితో పనిలేకుండానే ఎలట్రిక్ కార్లలో ప్రయాణించవచ్చు. మరో 20రోజుల్లోనే ఇవి విశాఖ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. దశల వారీగా ప్రభుత్వ అధికారులకు ఈ- కార్లను అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. వీటిని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సంస్థ సమకూర్చనుంది. దీంతో విశాఖ కాలుష్యరహిత నగరంగా మారనుంది.

విశాఖకు దాదాపు 400 - కార్లు అవసరమని అధికారుల అంచనా
విశాఖకు దాదాపు 400 ఈ- కార్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. తొలివిడతగా తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఈపీడీసీఎల్‌కు 67, జీవీఎంసీకి 30 ఈ-కార్ల కోసం ఈఈఎస్‌ఎల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం నగరంలోని డీలర్ల వద్ద 30 ఈ-కార్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఈపీడీసీఎల్‌కు 20, జీవీఎంసీకి 10 కార్లను మరో 20 రోజుల్లో డెలివరీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇవి కాక అధికారులకు మరో వంద కార్లు అవసరం ఉంది. దశల వారీ గా ఇతర ప్రభుత్వ శాఖలకు ఈ-కార్లను సమకూర్చనున్నారు.

12 నుంచి 13 లక్షల విలువ చేసే ఈ-కారును ఈఈ ఎస్‌ఎల్‌ కొనుగోలు
టాటా, మహిం ద్రా కంపెనీలు తయారు చేస్తున్న టాటా టిగార్, మహింద్రా ఈ-వెరిటో మోడల్‌ కార్లు అందుబాటులోకి వచ్చాయి. 12 నుంచి 13 లక్షల విలువ చేసే ఈ-కారును ఈఈ ఎస్‌ఎల్‌ కొనుగోలు చేస్తోంది. వీటిని వినియోగిస్తున్న శాఖలు డ్రైవర్‌ను సొంతంగా నియమించుకుని.. ఒక్కో కారుకు నెలకు 20 వేల చొప్పున ఈఈఎస్‌ఎల్‌కు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. వీటికి క్లచ్, గేర్లు ఉండవు. న్యూట్రల్, రివర్స్, స్పీడ్‌ పాయింట్లను మార్చుకోవాల్సి ఉంటుంది.. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లే వీలుంటుంది.

3, జీవీఎంసీలో 7, కలెక్టరాఫీసులో 2 చోట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్లు
12 ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్లు, 13 ఏసీ చార్జింగ్‌ పాయింట్లను సిద్ధం చేస్తున్నారు. ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ ఆఫీసులో 6, మధురవాడ, సర్కిల్, డివిజన్‌ కార్యాలయాల్లోను, కార్పొరేట్‌ కార్యాలయంలో 3, జీవీఎంసీలో 7, కలెక్టరాఫీసులో 2 చోట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్‌ మూడో వారం నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని ఈపీడీసీఎల్‌ అధికారులు తెలిపారు. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే కారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. వీటికోసం యూనిట్ విద్యుత్ ధరను 6 రూపాయల 95 పైసలుగా ఖరారు చేశారు.
భవిష్యత్తు మొత్తం ఈ కార్లదే
చార్జింగ్‌కు ఎక్కువ సమయం పట్టడంతోపాటు.. వంద కిలోమీటర్లకే పరిమితం కావడంతో ఈ కార్లను పట్టణ పరిథిలో మాత్రమే వినియెగించనున్నారు. పాస్ట్ చార్జింగ్‌, రహదారుల్లో ఛార్జింగ్ పాయింట్ల ఏర్సాట్లు జరిగితే భవిష్యత్తు మొత్తం ఈ కార్లదే అనడంలో అతిశయోక్తి లేదు. 

Don't Miss