ఏపీలో ఎన్నికల హడావుడి..

18:44 - December 7, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ ఆర్టీసీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిసారి నూతన రాజధాని అమరావతి కేంద్రంగా కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు జరగనుండడంతో కార్మిక సంఘాలైన ఎన్‌ఎంయూ, ఈయూ ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నాయి. ఐదేళ్లకు ఓసారి జరిగే ఈ ఎన్నికలకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 127 డిపోలలో ఈ నెల 16 నుంచి కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు జరగనున్నాయి. విజయవాడ జోన్ పరిధిలో కృష్ణా, గుంటూరు.. పశ్చిమగోదావరి రీజియన్ పరిధిలో సీసీఎస్ సభ్యులుగా ఉన్న 14,337 మంది డెలిగేట్లను ఈ ఎన్నికల ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ డెలిగేట్స్ అంతా కలిపి 9 మంది సభ్యులతో కూడిన పాలకమండలి సభ్యులను డిసెంబర్ 30వ తేదీన ఎన్నుకుంటారు.

ఈ సొసైటీ ద్వారానే కార్మికులకు రుణాలు..
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1952లో ఆర్టీసీ కార్మికుల కోసం కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీను స్థాపించారు. అప్పట్లో రూ.1,800 కోట్ల టర్నోవర్ తో సీసీఎస్ పనిచేసేది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీసీఎస్ రూ.1,000 కోట్ల టర్నోవర్ తో ఉంది. ఆర్టీసీ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు, ఇంటి రుణాలు, పిల్లల పెళ్లిళ్లకు రుణాలు, స్థలాల కొనుగోలుకు రుణాలు వంటివి ఈ సొసైటీ ద్వారానే ఇవ్వటం జరుగుతోంది. అంతేకాకుండా ఈయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్‌ ఫెడరేషన్‌, కార్మిక పరిషత్‌లు మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్నాయి. అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోని కృష్ణా రీజియన్ లో మొత్తం 26 మంది డెలిగేట్లను.. గుంటూరు రీజియన్‌లో 22 మంది డెలిగేట్స్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. విజయవాడ జోన్ పరిధిలోకి వచ్చే పశ్చిమగోదావరి రీజియన్ పరిధిలో 10 మంది డెలిగేట్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 58 డెలిగేట్లను ఎన్నుకోవాల్సి ఉంది.

కూటమిగా ఈయూ, స్వతంత్రంగా ఎన్‌ఎంయూ..
కూటమిగా ఈయూ, స్వతంత్రంగా ఎన్ఎంయూ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. కృష్ణా, గుంటూరు రీజియన్‌లు కలిపి గుంటూరు 1, 2, తెనాలి, తిరువూరు పశ్చిమ గోదావరి రీజియన్ లో తణుకు, ఏలూరు డిపోలను ఎస్.డబ్ల్యు.ఎఫ్.కు ఈయూ కేటాయించింది. కార్మిక పరిషత్ కు గుంటూరు 1, 2, నరసారావుపేట డిపోలను కేటాయించారు.

నేషనల్ మజ్దూర్ యూనియన్..ఈయూ ల ధీమా..
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన విపక్ష కార్మిక సంఘం ఎంప్లాయీస్ యూనియన్ నేతృత్వంలో పాలక మండలి పనిచేస్తోంది. ఇటీవల స్వల్ప మెజారిటీతో గుర్తింపును కైవసం చేసుకున్న నేషనల్ మజ్దూర్ యూనియన్ కూడా సీసీఎస్ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. గుర్తింపు సంఘంగా ఎన్నికై ఇప్పటివరకు కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించటం, యాజమాన్య అనుకూల విధానాలు అవలంభించడం ఆర్టీసీ కార్మికులలో అసంతృప్తిని రేపుతోందని దీంతో తమ విజయం ఖాయమని ఈయూ ధీమాగా ముందుకెళ్తోంది. సొసైటీకీ అన్ని అధికారాలు ఉండడంతో కార్మిక సంఘాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 

Don't Miss