ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు

07:41 - September 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. సుప్రీం కోర్టు 2002లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం రద్దైన అసెంబ్లీకి త్వరగా ఎన్నికలు నిర్వహించడాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుంటామని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తైన వెంటనే ఎలక్షన్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పారు. అటు కేంద్రం నుంచి ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 11న హైదరాబాద్ కు రానున్నారు.
అసెంబ్లీ రద్దయితే వీలైనంత త్వరలో ఎన్నికలు 
మధ్యప్రదేశ్‌, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం ఈనాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు జరిపే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి ఓపి రావత్‌ ఢిల్లీలో తెలిపారు. అసెంబ్లీ రద్దు తర్వాత ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడు నిర్వహించాలన్న దానిపై చట్టంలో ప్రత్యేక నిబంధన అంటూ ఏదీ లేదన్నారు. ఎప్పుడైనా అసెంబ్లీ రద్దయితే వీలైనంత త్వరలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని సుప్రీంకోర్టు 2002లో రూలింగ్‌ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వానికి అనవసరంగా లాభం చేకూర్చవద్దని... 6 నెలల సమయముందని అన్ని రోజులు పాలన చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టమైన రూలింగ్‌ ఇచ్చిందని రావత్‌ స్పష్టం చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్‌
మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని చెబుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి బేగంపేటలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ రజత్‌ కుమార్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబిత సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఎన్నికల ఏర్పాట్లు, బూత్‌ లెవర్‌ ఆఫీసర్ల నియామకంపై చర్చించారు. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని.. ఈవీఎంలు రాష్ట్రానికి చేరుకుంటాయని రజత్‌కుమార్ తెలిపారు. 
ఈనెల 11న హైదరాబాద్ కు ఈసీ అధికారులు
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 11న హైదరాబాద్ రానున్నారు. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వచ్చి ఇక్కడి పరిస్థితులను పరిశీలించి నివేదిక సిద్ధం చేయనున్నారు. ఈ నివేదిక ఆధారంగా తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ఊపందుకునే అవకాశాలున్నాయి.

 

Don't Miss