డిసెంబర్ 4న 'ధృవ' ప్రీ రిలీజ్..

09:42 - December 2, 2016

మెగా కుటుంబం నుండి పరిచయమైన హీరోల సినిమాలపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటుంటారు. ప్రధానంగా మెగాస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్ చరణ్ తేజ' చిత్రాల గురించి ఆసక్తి ఎదురు చూస్తుంటారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలు కొన్ని డిజాస్టర్ గా మిగలడంతో 'రామ్ చరణ్' ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన 'తనీ ఒరువన్' తెలుగు రీమెక్ 'ధృవ'. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'మ‌గ‌ధీర' వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత రాంచ‌ర‌ణ్‌, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ కాంబినేష‌న్‌లో 'ధృవ' వస్తోంది. ఇటీవలే చిత్ర ఫస్ట్ లుక్..పోస్టర్..టీజర్..థియేట్రికల్ ట్రైలర్ విడుదలయ్యాయి. ఇదిలా ఉంటే 'ధృవ' చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. అందులో భాగంగా డిసెంబర్ 4వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 'రామ్ చరణ్' పోలీసు ఆఫీసర్ గా నటిస్తుండడంతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను పోలీస్ స్టేషన్ లో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించిందని టాక్. యూసుఫ్ గూడ పోలీస్ లైన్ లో ఈ ఫంక్షన్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. 'రామ్ చరణ్' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' నటించగా అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి. 

Don't Miss