జన్‌ధన్‌ ఖాతాలో వేసిన నల్లధనాన్ని విత్‌ డ్రా చేయొద్దు : మోడీ

07:26 - December 4, 2016

ఉత్తరప్రదేశ్ : జన్‌ధన్‌ ఖాతాలో వేసిన నల్లధనాన్ని విత్‌ డ్రా చేయకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోది ఖాతాదారులకు విజ్ఞప్తి చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ధనికులు ఇప్పుడు పేదల ఇళ్లముందు క్యూలు కడుతున్నారని తెలిపారు. జన్‌ధన్‌ ఖాతాలో వేసిన నల్లధనం పేదలకే చెందుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో నిర్వహించిన బిజెపి పరివర్తన్‌ ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ..పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. 
భాజపా పరివర్తన్‌ ర్యాలీలో 
పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తిప్పికొట్టారు. భారత ప్రజలే తన అధిష్ఠానమని చెబుతూ నల్లధనం, అవినీతిపై దాడిచేసి తానేమైనా నేరం చేశానా? అని ప్రజల్ని ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నిర్వహించిన భాజపా పరివర్తన్‌ ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. 'పేద ప్రజల హక్కులను అవినీతి దోచుకొందన్న  మోదీ..అన్ని నష్టాలకు అదే మూలమన్నారు. నల్లధనం, అవినీతిపై దాడి చేసి నేనేమైనా నేరం చేశానా?' అని మోదీ ప్రజలను ప్రశ్నించారు. నోట్ల రద్దు తర్వాత నిజాయతీపరులు బ్యాంకుల ముందు నిలబడితే అవినీతిపరులు పేద ప్రజల ఇళ్ల ముందు వరుస కట్టారని ఎద్దేవా చేశారు. '70 ఏళ్లుగా ప్రజలు నిత్యావసరాల కోసం క్యూ కట్టారు,.ఇప్పుడు బ్యాంకుల ముందు నిలబడ్డ వరుసే అన్ని వరుసలకు శుభం పలికే చివరి క్యూ' అని వెల్లడించారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యర్థులు నన్నేం చేయగలరు,..నేనో సన్యాసిని. నా చిన్నపాటి సామగ్రితో వెళ్లిపోగలను' అని మోదీ విమర్శించారు. 
పేదరికాన్ని తరిమికొట్టాలి : మోడీ
దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ముందుగా ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, పశ్చిమ్‌బంగా వంటి పెద్ద రాష్ట్రాల్లో పేదరికాన్ని తరిమికొట్టాలన్నారు మోదీ. బీజేపి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా,.దాని నాయకులు అభివృద్ధి బాటనే ఎంచుకొంటారని స్పష్టం చేశారు. 'అవినీతిపై పోరాటం నేరమా? అవినీతిపై యుద్ధం చేస్తోంటే కొందరు నన్ను తప్పు చేస్తున్నవాడిని అని ఎందుకు అంటున్నారు?' అని మోదీ ప్రశ్నించారు. నల్లధనాన్ని జన్‌ధన్‌ఖాతాల్లో జమచేసిన అవినీతిపరులను జైల్లో వేసేందుకు ఉన్న దారులను వెతుకుతున్నానన్నారు మోదీ.   
పేద ప్రజలకే తీవ్ర ఇబ్బందులు : ఏచూరీ  
అయితే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా పెద్దనోట్లను రద్దు చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల సంపన్నులకు, నల్లకుబేరులకు ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదని, కేవలం పేద ప్రజలే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీకి కావల్సినవారిపై, ధనికులపై ఎలాంటి ప్రభావం పడకుండా కేంద్రం  పెద్ద నోట్ల రద్దు  నిర్ణయం తీసుకుందని ఏచూరి విమర్శించారు. 
చరిత్రలోనే అతి పెద్ద తప్పుడు నిర్ణయం : అభిషేక్ సింఘ్వీ 
నోట్ల రద్దు నిర్ణయం భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద తప్పుడు నిర్ణయమని కాంగ్రెస్ జాతీయనేత అభిషేక్ సింఘ్వీ అన్నారు. రోజుకో రూల్స్‌తో కేంద్రం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. రద్దు నిర్ణయం ప్రకటించిన రోజు బీజేపీ నేతలకు సంబంధించిన అకౌంట్లలో కోట్ల రూపాయల డబ్బు జమ అయినట్లు తమ దగ్గర ఆధాలున్నాయని సింఘ్వీ తెలిపారు. 
వెనక్కి తగ్గేది లేదన్న ప్రధాని మోడీ
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ యూపీ సభలో స్పష్టం చేశారు. అవినీతిపై జరిపే ఈ మహాయుద్ధంలో వెనకడడుగు వేసే ప్రసక్తేలేదని మోదీ స్పష్టం చేశారు. కానీ..నోట్ల రద్దు వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులు ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. రద్దైన నోట్లు..వాటి స్థానంలో కొత్త నోట్లు అందుబాటులోకి రావాలంటే మరికొన్ని నెలలు ఈ కష్టాలు పడక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

Don't Miss