కూరగాయల మార్కెట్‌పై పెద్దనోట్ల రద్దు ప్రభావం

09:07 - December 1, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు ప్రభావం నిత్యావసరాలపై పడింది. చిల్లర సమస్యతో కూరగాయల అమ్మకాలు పడిపోవడంతో రేట్లు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు 500నోటు తీసుకుని మార్కెట్‌కు వెళ్లితే సంచి నిండని పరిస్థితి. కానీ ప్రస్తుతం చిల్లర సమస్యతో కొనేవారు కరువవడంతో కూరగాయల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. దీంతో నిత్యం కొనుగోలుదారులతో రద్దీగా ఉండే రైతుబజార్‌లు నేడు వెల వెల బోతున్నాయి. మరోవైపు కూరగాయల ధరలు భారీగా తగ్గిపోవడంతో సామాన్యులు ఖుషీగా ఉన్నారు. 
తీవ్ర చిల్లర సమస్య  
పెద్దనోట్ల రద్దు కూరగాయల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కూరగాయాల మార్కెట్‌కు వెళ్లాలంటే జేబులో 20,10, 5 రూపాయల లాంటి చిల్లర ఉండాల్సిందే. కానీ ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దువల్ల చిల్లర సమస్య తీవ్రంగా వేధిస్తోంది. కొత్త 500, 2వేల నోటుకు చిల్లర దొరక్కపోవడంతో కూరగాయల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్లు, రైతు బజార్‌లు కస్టమర్లు లేక వెలవెల బోతున్నాయి. 
భారీగా తగ్గిన కూరగాయల రేట్లు  
పెద్ద నోట్ల రద్దుతో కూరగాయల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోవడంతో..అటు కూరగాయల రేట్లు కూడా  భారీగా తగ్గాయి. కొనేవాళ్ళు రాక పోవడమే రేట్లు దిగిరావడానికి కారణంగా తెలుస్తోంది. టమాటా , చిక్కుడు, బీన్స్, కాకర ఇలా అన్ని రకాల కూరగాయలు కిలో 20 నుంచి 25రూపాయల లోపే దొరుకుతున్నాయి. దీంతో ఒకప్పుడు 500 నోటు ఖర్చుపెట్టందే సంచినిండని పరిస్థితి నుంచి ఇవాళ..100, 200 రూపాయలతో సంచి నిండా వారానికి సరిపడా కూరగాయల్ని తీసుకెళ్తున్నారు. 
రైతులు ఆవేదన 
పెద్ద నోట్లను తీసుకుని ఇబ్బందులు పడటం ఎందుకని వ్యాపారులు వాటిని తీసుకోవడం మానేసారు. దీంతో కొనేవాళ్ళు లేక రేట్లు పడిపోయాయాని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రూపాయలకు కిలో కూరగాయాలు కొనేవారు 2వేల కొత్తనోటు ఇస్తే చిల్లర ఎలా ఇవ్వాలని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. చిల్లర సమస్యతో అమ్మకాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు కూరగాయల ధరలు సగానికి సగం తగ్గడంతో అటు రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడి కూరగాయల్ని పండించి తీరా అమ్ముకుందామని మార్కెట్‌కు తీసుకొస్తే..ధరులు లేక చివరకు కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
వ్యాపారులు ఆందోళన 
మొత్తానికి పెద్ద నోట్ల రద్దు ప్రభావం కూరగాయల మార్కెట్‌పై పడడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. చిల్లర కొరతతతో కొనేవాళ్ళు లేక కూరగాయల రేట్లు  పడిపోవడంతో గిట్టుబాటు కావడంలేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సామాన్యులు మాత్రం కూరగాయల ధరలు తగ్గడంతో ఆనందంగా ఉన్నారు. 

 

Don't Miss