నగదు కొరత.. ప్రజాగ్రహం

21:04 - December 8, 2016

హైదరాబాద్ : నగదు కొరత.. ప్రజల్లో అసహనాన్ని పెంచుతోంది. నెలరోజులుగా వేచి చూస్తున్నా పరిస్థితి ఏమాత్రం మెరుగుపడక పోవడం ప్రజల ఆగ్రహాన్ని రెట్టింపు చేస్తోంది. మొన్నటిదాకా మోదీకి జయహో అన్న వారు కూడా.. వాస్తవ పరిస్థితి అవగతమై కమలనాథుడిపై విరుచుకు పడుతున్నారు.  కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న సొమ్ములోంచి కేవలం రెండువేల రూపాయలు విత్‌ డ్రా చేసుకోవడానికీ వీల్లేని దుస్థితి ఓవైపు.. బడాబాబులు వందల కోట్లు నల్లధనాన్ని కొత్తనోట్లతో మార్చేసుకున్నారన్న వార్తలు మరోవైపు.. ప్రజల కోపాన్ని తారాస్థాయికి పెంచుతోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నా డబ్బు దొరకని పరిస్థితిలో గొడవలు పెచ్చు మీరుతున్నాయి. 
తీరని నోట్ల కష్టాలు
నెల గడిచినా.. ప్రజల నోట్ల కష్టాలు తీరడం లేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు రోజల తరబడి లైన్లలో నిలబడ్డా డబ్బులు దొరకడం లేదు. దీంతో జనం తీవ్ర అసహనానికి గురై తిరగబడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నగదు దొరక్క చిరు వ్యాపారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ముందుచూపు లేకుండా నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంపన్నులు, బడా బాబులకు ఇంటి వద్దకే వచ్చి చేరుతున్న కొత్త నోట్ల కట్టలు.. పేదలు, మధ్యతరగతి వారికి మాత్రం అందుబాటులోకి రావడం లేదు. 
మాజీ సైనికుడిపై కానిస్టేబుల్ దాడి 
నగదు సమస్యలతో ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోంది. దీంతో కొన్ని చోట్ల దాడులకు దిగుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి.  కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో మాజీ సైనికుడిపై బ్యాంకు ముందు ఓ కానిస్టేబుల్ దాడికి దిగాడు. బ్యాంకు ఇంకా ఎందుకు తెరవలేదన్నందుకు మాజీ సైనికుడిపై ఈ దాడి జరగడం గమనార్హం. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ఓ బ్యాంకులో దోపిడీకి పాల్పడి పది లక్షల కొత్త నోట్లను ఎత్తుకెళ్లారు.  
బ్యాంకులు, ఏటీఎంల వద్ద జన జాతర     
నోట్ల రద్దు జరిగి నెల గడుస్తున్నా .. బ్యాంకులు ఏటీఎంల వద్ద జన జాతర తగ్గలేదు. పైగా నెలలో మొదటి వారం కావడంతో జనాల సంఖ్య మరింత పెరిగింది. వృద్ధులు, వికలాంగులు తమ ఖాతాల్లో పడిన పింఛన్ డబ్బులు తీసుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉద్యోగులు, పెన్షన్‌దారులతో పాటు  రైతులు సైతం బ్యాంకుల వద్ద పడిగాపుల పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఉద్యోగులు, పెన్షన్‌ దారులు, రైతులు ఆందోళన    
ఏపీలో పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం ఇండియన్‌ బ్యాంకు ఎదుట ఉద్యోగులు, పెన్షన్‌ దారులతో పాటు రైతులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి డబ్బులకోసం పడిగాపులు పడితే రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారంటూ జనం సిబ్బందిని నిలదీశారు.  బ్యాంకుల వద్ద పెరిగిన రద్దీ శ్రీకాకుళం జిల్లా లో ఓ వృద్ధుణ్ణి బలి తీసుకుంది. కవిటి మండలం బోరివంక లోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ వద్ద క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్న వరక గ్రామానికి చెందిన కోగా బెహరా అనే వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు.  అక్కడున్నవారు ప్రథమ చికిత్స అందించే లోపే ఆయన మృత్యువాత పడ్డాడు. 
మోడీ సర్కార్ పై పలు విమర్శలు 
బ్లాక్ మనీ భరతం పట్టేందుకే  పెద్ద నోట్లు రద్దు చేపట్టామని చెబుతున్న సర్కారు.. దిగువ, మధ్య తరగతి ప్రజల కష్టాలను మర్చిపోయిందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న నోట్లు తగినన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
కొనసాగుతూనే నోట్ల కష్టాలు  
కడప జిల్లాలో నోట్ల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నగదు కోసం ప్రజలు రాత్రనక, పగలనక పడిగాపులు కాస్తూ జాగారం చేస్తున్నారు. వేకువ జామునే బ్యాంకుల వద్దకు మహిళలు చిన్నపిల్లలను ఎత్తుకుని వచ్చి క్యూలో నిలబడుతున్నారు. ప్రజల అవసరాలకు తగ్గ డబ్బు లేకపోవడంతో చాలా బ్యాంకుల్లో నో క్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో చాలాచోట్ల జనం తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. బ్యాంకు సిబ్బంది డబ్బులు లేవని చెపుతుండటంతో మహిళలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటున్న ప్రజలు  
ప్రభుత్వం ప్రజలకు సరిపడా నగదును పంపిణీ చేయడంలో తీవ్రంగా విఫలమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లేదంటే జనాగ్రహానికి గురికావాల్సి వస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

 

Don't Miss