ఒకటో తారీఖు...బ్యాంకులు, ఏటీఎం వద్ద ఉద్యోగులు క్యూ

07:00 - December 2, 2016

హైదరాబాద్ : నిన్న ఒకటో తారీఖు రావడంతో.. వేతన జీవులు బ్యాంకులకు క్యూ కట్టారు. ఎక్కడ చూసినా ఏటీఎంల వద్ద భారీ లైన్లు కనిపిస్తున్నాయి. బ్యాంకు ఖాతాల్లో జమ అయిన జీతం డబ్బులను తీసుకునేందుకు ఉద్యోగులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఇళ్లు గడిచేందుకు సరిపడా సొమ్ముల్ని సమకూర్చుకోవడం ఎలా..అన్న ఆందోళన అందరినీ పట్టి పీడిస్తోంది. 
80 శాతం ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులు 
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో.. ఏ బ్యాంకుకు వెళ్లినా.. చాంతాడంత క్యూలు దర్శనమిస్తున్నాయి. 80 శాతం ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. పెద్ద నోట్లు రద్దు చేసి  మూడు వారాలు దాటినా... ఇంకా నగదు కొరత మాత్రం తీరడం లేదు. ప్రజల అవసరాలకు తగిన నగదు లభించట్లేదు.. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేయాలా..? లేక బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలలో నిలుచోవాలో అర్థంకాక సతమతమవుతున్నారు. నగదు విత్‌డ్రాయల్స్‌పై పరిమితుల నేపథ్యంలో అవసరాలకు తగిన సొమ్మును.. ఎలా విత్‌డ్రా చేసుకోవాలన్న ఆందోళనలో ఉద్యోగులు  ఉన్నారు. ఒకటో తారీఖు రావడంతో... ఖాతాల్లో జమైన డబ్బుల్ని ఎలా తీసుకోవాలన్న ఆందోళనలో ఉద్యోగులున్నారు. నగదు విత్ డ్రా కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఉద్యోగులు క్యూలు కడుతున్నారు. 
బ్యాంకుల్లో పరిస్థితి దారుణం
ఇంటి అద్దె, పాల ఖర్చులు, కూరగాయల కొనుగోలు, పిల్లల ఫీజులతో పాటు ఇతర ఖర్చులకు చేతిలో డబ్బులుంటేనే అవసరాలు తీరుతాయి.  ప్రస్తుతం బ్యాంకుల్లో పరిస్థితి దారుణంగా ఉంది.  ఫస్ట్‌ తారీఖు కావడంతో బ్యాంకులకు నగదు విత్‌డ్రాకోసం సామాన్యులతో పాటు ఉద్యోగులు భారీగా పోటెత్తుతున్నారు. బ్యాంకర్లు, ఆర్థికశాఖ అధికారులు, ఆర్‌బీఐ అధికారులు ఉద్యోగులకు నగదు తీసుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ... వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సరిపడా కొత్తనోట్లు ఆర్బీఐ నుంచి బ్యాంకులకు రాకపోవడంతో... ఉన్న నగదుతోనే సర్దుబాటు చేసేందుకు బ్యాంకర్లు సతమతమవుతున్న పరిస్థితి ఉంది. 
ఉద్యోగులు హైరానా 
ఇంటి అవసరాలకు సరిపడా నగదు లభించకపోవడంతో ఉద్యోగులు హైరానా పడుతున్నారు.  ఎక్కడ చూసినా చాంతాడంత క్యూ లైన్లు ఉండటంతో కనీస అవసరాలకైనా డబ్బులు దొరుకుతాయా అన్న ఆందోళన ఉద్యోగులను వేధిస్తోంది. తక్షణమే భారీ మొత్తంలో కొత్త నోట్లను సరఫరా చేసి.. ఏటీఎంల్లో నింపితే కానీ.. పరిస్థితి సద్దుమణిగేలా లేదని సామాన్యులు, ఉద్యోగులు వాపోతున్నారు. 
  

 

Don't Miss