గంగపుత్రుల బతుకులు దుర్భరం

20:09 - December 9, 2016

విశాఖ : గంగపుత్రుల బతుకులు తెగిన గాలిపటంలా మారాయి. ఒడ్డుకు చేరిన చేపపిల్లాల విలవిల్లాడుతున్నాయి. మోడీ దెబ్బకు జీవనోపాధే ప్రశ్నార్థకంగా మారింది. కుటుంబాలు గడవక పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయి. పెద్ద నోట్ల రద్దుతో మత్స్యకారుల వ్యాపారాలు బేజారయ్యాయి. గిరాకీ లేక ఊసురుమంటున్నారు. ఆదుకున్నగంగమ్మే ఇప్పుడు కాదు పొమ్మంటుంటే.. ఏం చేయాలో తెలియక గుండెలు బాదుకుంటున్నారు. కేంద్ర నిర్ణయంతో రోడ్డునపడ్డ మత్స్యకారుల కుటుంబాల జీవన స్థితిగతులపై 10 టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్‌...! 
నోట్ల రద్దుతో కుదేలైన చేపల వ్యాపారం
500, వెయ్యి నోట్ల రద్దుతో మత్స్యకారుల జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది. వారి కుటుంబాలు గడవడం ప్రస్తుతం కష్టంగా మారింది. పెద్ద నోట్ల రద్దుతో విశాఖలో చేపల వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. బిజినెస్‌ లేక ప్రస్తుతం వ్యాపారాలు మానేశారు. వ్యాపారాలు సరిగ్గా లేకపోవడం వల్ల బోటు యజమానుల నుంచి చేపలు కొనుగోలు తగ్గించేశామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేపల అమ్మకాలపై 50 వేల మంది మత్య్సకారుల జీవనం 
గిరాకీ లేక ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు
విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మంది మత్య్సకారులు చేపల అమ్మకాలపై జీవనం సాగిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో గీరాకీ లేక అమ్మకం, కొనుగోలుదారుల పరిస్థితి చాలా దయనీంగా మారింది. నాడు హుదూద్‌ తుపాన్‌ సమయంలో చేపల వేట సాగక.. చేపలు దొరకని పరిస్థితి. ఇప్పుడేమో పుష్కలంగా చేపలు ఉండి కూడా డబ్బుల్లేక ఏకమొత్తంలో చేపలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. 
గతంలో రోజుకు రూ.30 కోట్లు సాగిన వ్యాపారం
30 కోట్ల నుంచి  కోటి రూపాయలకు తగ్గిన బిజినెస్‌
విశాఖ జిల్లా వ్యాప్తంగా రోజుకు దాదాపు 30 కోట్ల చేపల వ్యాపారం జరుగుతుంది. ఇందులో ఎగుమతుల కంటే చిల్లర వ్యాపారమే ఎక్కువ. ఇప్పుడు చేపల సీజన్ కావడంతో మత్స్యకారులు మంచి బిజినెస్ జరుగుతుందని ఆశపడ్డారు. కానీ మోదీ నిర్ణయంతో రోజుకు 30 కోట్ల వ్యాపారం జరిగే చోట ప్రస్తుతం కోటి రూపాయల బిజినెస్ కూడా జరగటం లేదు. పెద్ద నోట్లు రద్దుతో వ్యాపారులు చేపలు కొనడం మానేశారు. కొనుగోలుదారులు కూడా 2వేల నోట్లు తీసుకురావడంతో వారికి చిల్లర ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.
ఎండు చేపలు మార్కెట్‌ పరిస్థితి దయనీయం 
సీజన్ కావడంతో సముద్రంలో చేపలు సమృద్ధిగా దొరుకుతున్నా పెద్ద నోట్ల రద్దుతో అమ్మకాలు జరగడం లేదని సెంట్రల్ మైరేన్ ఫిషరీస్ సర్వేనే స్పష్టం చేస్తోంది. కనీసం డీజిల్‌ ఖర్చులకు కూడా డబ్బులు రాకపోవడంతో చాలామంది చేపల వేటకు వెళ్లడం మానేశారు. అటు మార్కెట్‌, ఇటు వీధుల్లో చేపల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. హర్బర్‌లో ఎండు చేపలు మార్కెట్‌ పరిస్థితి చాలా దయనీయంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా చిల్లర కష్టాలు పరిష్కరించాలని మత్స్యకారులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

Don't Miss