ఇంకెన్నాళ్లీ కష్టాలు..

21:28 - December 2, 2016

హైదరాబాద్ : ఉద్యోగులు, పెన్షనర్లపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం భారీగా చూపుతోంది. జీతాల కోసం వేతనజీవులు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు 10 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే నిబంధన విధించడంతో.. నెలంతా ఆ డబ్బుతో ఎలా గడపాలన్న ఆందోళన ఉద్యోగులు, పెన్షనర్లను పట్టి పీడిస్తోంది.

ఏ బ్యాంకుకు వెళ్లినా.. చాంతాడంత క్యూలు..
ఏ బ్యాంకుకు వెళ్లినా.. చాంతాడంత క్యూలు.. ఏటీఎంల్లో నో క్యాష్‌ బోర్డులు... కొత్త నోట్లు విడుదలై మూడు వారాలు దాటినా... నగదు కొరత మాత్రం తీరడం లేదు. నెల ప్రారంభం కావడంతో.. ఖాతాల్లో జమైన డబ్బుల్ని ఎలా తీసుకోవాలన్న ఆందోళనలో ఉద్యోగులున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతంతో సంబంధం లేకుండా కేవలం 10 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో నగదు విత్ డ్రా కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఉద్యోగులు క్యూలు కడుతున్నారు.

జీహెచ్‌ఎంసీ కార్మికుల వేతన కష్టాలు
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి మున్సిపల్‌ కార్మికులు పోటెత్తారు. నెల జీతాలు తీసుకునేందుకు బారులు తీరారు. క్యూ లైన్లో వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు. 10 వేల విత్‌ డ్రా నిబంధనపై పెదవి విరుస్తున్నారు. హైదరాబాద్‌ ఎస్బీఐ శాఖలు... ఇచ్చే 10 వేలు డిపోల దగ్గరే చెల్లిస్తే.. తమకిన్ని కష్టాలుండవని ఉద్యోగులు వాపోతున్నారు.

జీతాల కోసం వచ్చిన ఉద్యోగులు, సామాన్యులతో బ్యాంకులు రద్దీ
ఇక మండలాల్లో పరిస్థితి ఇంక దారుణంగా ఉంది. జీతాల కోసం వచ్చిన ఉద్యోగులు, సామాన్యులతో బ్యాంకులు కిటకిటలాడాయి.ఉదయం నుంచే క్యూలైన్‌లో జనం బారులు తీరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినా..నగదు కొరతతో కొందరు ఉసురుమంటూ వెనుదిరిగారు. పలుచోట్ల వృద్ధులు, మహిళలు క్యూలైన్లలో నిల్చోలేక ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పలు బ్యాంకులు, ఏటీఎంల్లో నో క్యాష్‌ బోర్డులు దర్శనమిచ్చాయి.

వింత పద్ధతుల్లో వధూవరులకు పెండ్లి కానుకలు
పెద్ద నోట్ల రద్దుతో పెళ్లి కానుకలు వింత పద్ధతుల్లో వధూవరులకు సమర్పిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓ పెళ్లికి హాజరైన కమాన్‌పూర్‌ మార్కెట్ కమిటీ కార్యదర్శి నూతన వధూవరులకు కానుకగా ఐదువేల రూపాయలను ఇవ్వడం ప్రాధాన్యత చోటుచేసుకుంది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో చెక్కు రూపంలో కానుక ఇచ్చానని తెలిపారు.

ఎల్ ఐసీ ప్రీమియం చెల్లింపులపై నోట్ల ప్రభావం
నోట్ల రద్దు ప్రభావం.. ఎల్ ఐసీ ప్రీమియం చెల్లింపులపై పడింది. సంగారెడ్డి ఎల్‌ఐసీ శాఖలో రోజువారీ కలెక్షన్ 30లక్షల నుంచి 2లక్షలకు పడిపోయింది. ఆర్బీఐ నుంచి నగదు రాక తగ్గడం వల్లే... చెల్లింపు సమస్యలు ఏర్పడ్డాయని బ్యాంకు మేనేజర్లు చెబుతున్నారు.మొత్తం మీద... బ్యాంకులు, ఏటీఎంల్లో నో క్యాష్‌ బోర్డులు కనిపించడం..జనాన్ని అసహనానికి గురిచేసింది. పెద్ద నోట్లు రద్దై 23 రోజులు కావొస్తున్నా...నగదు కొరత సమస్య రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. 

Don't Miss