తమిళనాడుకు'డిసెంబర్'గండమా?!..

12:51 - December 6, 2016

తమిళనాడు : తమిళనాడు రాష్ట్రానికి డిసెంబర్ నెల శాపంగా తయారైందా? ఈనెలలోనే తమిళనాడులో ప్రముఖుల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయా? అంటే పరిస్థితులను గమనిస్తే నిజమే అనుకోవాల్సిన వస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన విషాద ఘటనలన్నీ డిసెంబర్ లోనే జరుగుతుండటం యాదృచ్ఛికమా? లేక కాలప్రభావమా? లేదా ఇంకేదైనా కారణమా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో ఎంతో మంది ప్రజా నేతలు..నేతలు..కవులు.. డిసెంబర్ లో మరణించారు. జయలలిత రాజకీయ గురువు, మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ 1987 డిసెంబర్ 24న కన్నుమూయగా, ఆయన ప్రియ శిష్యురాలు నేడు అదే నెలలో నింగికేగడం గమనార్హం. ఇక చివరి భారత గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి 1972 డిసెంబర్ 25న, పెరియార్ రామస్వామి అదే సంవత్సరం డిసెంబర్ 24న మరణించారు. 2004 డిసెంబర్ 26న సుమత్రా దీవుల్లో భూకంపం కారణంగా వచ్చిన సునామీ ఎలాంటి బీభత్సాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక గత సంవత్సరం డిసెంబర్ లో చెన్నై, ఇతర ప్రాంతాలను వరద చుట్టుముట్టి ఎంతో ఆస్తి నష్టానికి కారణమైంది. ఈ వరద ప్రభావం చెన్నై ఐటీ కంపెనీలపై పెను ప్రభావాన్ని చూపగా, వేల కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.

ఇద్దరు మహిళా సీఎంలు ఒకే తీరుగా మరణం??
తమిళనాడు రాష్ట్రాన్ని ఇద్దరు మహిళలు జయలలిత, జానకి రామచంద్రన్ లు పరిపాలించారు. జయలలిత ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగా... జానకి కేవలం ఒక్కసారి మాత్రమే ఈ పదవిని అలంకరించారు. 1988 జనవరి 7వ తేదీ నుంచి జనవరి 30వ తేదీ వరకు... అంటే 23 రోజులు ముఖ్యమంత్రిగా ఆమె వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సతీమణే జానకి. అయితే, ఈ ఇద్దరు మహిళా ముఖ్యమంత్రులు ఒకే రీతిలో చనిపోవడం గమనార్హం. వీరిద్దరూ కార్డియాక్ అరెస్ట్ తోనే ప్రాణాలు వదిలారు.

తొలుత జయలలిత గుండెపోటుకు గురైందని వార్తలు వచ్చాయి. కానీ, ఆమె కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారంటూ ఆ తర్వాత వైద్యులు స్పష్టం చేశారు. అనంతరం, వైద్యులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ జయను బతికించలేకపోయారు. జానకి రామచంద్రన్ కూడా ఇదే రీతిలో తుదిశ్వాస విడిచారు. 1996 మే 19న ఆమె కూడా కార్డియాక్ అరెస్ట్ కు గురై, మృతి చెందారు.

డిసెంబరు 16న మరణించిన మద్రాసు ప్రెసిడెన్సీ సీఎం పానగల్ రాజా
పానగల్ రాజాగా ప్రసిద్ధి చెందిన సర్ పానగంటి రామారాయణింగారు (జూలై 9, 1866 – డిసెంబరు 16, 1928), కాళహస్తి జమిందారు, జస్టిస్ పార్టీ నాయకుడు మరియు జూలై 11, 1921 నుండి డిసెంబరు 3, 1926 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రామారాయణింగారు 1866, జూలై 9న కాళహస్తి లో జన్మించాడు. మద్రాసులో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము మరియు ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. ఈయన జస్టిస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. 1925 నుండి 1928 వరకు పార్టీ అధ్యక్షునిగా పనిచేశాడు.

డిసెంబర్ 30న కన్నాభిరాన్ మరణం..
కె.జి.కన్నబిరాన్ కన్నాభిరాన్ గా సుపరిచితులుగా వున్న పౌరహక్కుల ఉద్యమనేత మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది.ఆయన "పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్" సంస్థకు సహ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు కూడా డిసెంబర్ 30,2010 మరణించారు.

రాష్ట్రంలో రెండో మహిళా సీఎం జయలలిత..
ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి జయలలిత అనే విషయం తెలిసిందే.ఇలా కారణం ఏదైనా డిసెంబర్ నెలలో తమిళనాడు ప్రముఖులు మృతి చెందటం గమనించదగిన విషయం.

Don't Miss