దాసరి ఇంట్లో ఆస్తి వివాదం...

07:29 - September 11, 2018

హైదరాబాద్ : దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు ఇంట్లో ఆస్తివివాదాలు తలెత్తాయి. పెద్ద కుమారుడు సతీమణి సుశీల... దాసరి కుటుంబ సభ్యుల మధ్య వివాదం రాజుకుంది. కొన్నేళ్లుగా బయట ఉంటున్న దాసరి పెద్దకోడలు సుశీల... సోమవారం దాసరి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.  పోలీసులు, మహిళా సంఘాలతో కలిసి సుశీల ఇంట్లోకి ప్రవేశించింది. ఏడాదిన్నరగా తనను ఇంట్లోకి రానివ్వడం లేదని దాసరి చిన్న కుమారుడైన అరుణ్‌, అతడి భార్యపై ఆరోపణలు చేశారు. 

తాను మొన్నటి వరకు పంజాగుట్టలోని ఇంట్లో ఉన్నానని... ఇప్పుడు అదికూడా ఖాళీ చేయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను తన నుంచి దూరం చేస్తున్నారని ఆరోపించారు. విడాకుల కోసం సుశీల దరఖాస్తు చేసిందన్న ఆరోపణలపైనా ఆమె స్పందించారు. డైవర్స్‌ కోసం తానెప్పుడూ దరఖాస్తు చేయలేదన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్నవారు... ఆధారాలుంటే చూపించాలన్నారు. తనకు న్యాయం జరిగేలా సినీ పెద్దలు కల్పించుకోవాలని ఆమె కోరారు. దాసరి నారాయణరావు చనిపోయి ఏడాది కూడా కాలేదు. అప్పుడే కుటుంబ సభ్యుల మధ్య ఆస్తితగాదాలు తలెత్తాయి. దాసరి చిన్న కుమారుడు అరుణ్‌ ప్రస్తుతానికి విదేశీ పర్యటనలో ఉన్నారు. మరి ఆయన వచ్చేలోగా  ఈ వివాదం ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.

Don't Miss