రద్దుపై 'సంత' గోల..

11:01 - December 7, 2016

ఖమ్మం : పెద్దనోట్ల రద్దుతో పేదల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నగరవాసులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతుంటే... గ్రామీణ ప్రాంతీయులు కనీస అవసరాలు తీరక.. అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా పల్లెవాసుల జీవితాలు అంధకారంగా మారాయి.

పండితాపురం సంతకు పెద్దనోట్ల ఎఫెక్ట్‌
నోట్ల రద్దు వ్యవహారంతో.. గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. వారం వారం జరిగే సంతల్లో గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఖమ్మం జిల్లా... కామేపల్లి మండలం పండితాపురం సంతలో ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి బుధవారం.. ఇక్కడ జరిగే సంతలో కోటి 50 లక్షల రూపాయల వ్యాపారం జరిగేది. నోట్ల రద్దుతో ఇప్పుడది లక్ష రూపాయలకు పరిమితమైంది. కరెన్సీ కొరతతో సంతలో సరుకులు అమ్ముడుకావడం లేదు. సంతలో ఐదు వేలకుపైగా వచ్చేవని.. ఇప్పుడు కేవలం ఐదు వందల రూపాయలలోపే వస్తుందని చిరు వ్యాపారులు వాపోతున్నారు.

ఖాళీగా దర్శనమిస్తున్న స్టాళ్లు..
నోట్ల రద్దుతో సంతలో కూరగాయలు.. పశువులు..పువ్వులు.. నిత్యావసరాలు.. దుస్తులు.. ప్లాస్టిక్‌ వస్తువులు.. వచ్చిపోయే వారికోసం పెట్టే టీ..టిఫిన్‌ స్టాళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కూరగాయలు..పువ్వులు కొనేవారు లేక పాడైపోతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేసేదిలేక ఎంతోకంతకు వినియోగదారులకు ఇచ్చేస్తున్నారు. రూ.10, 20, 50, వంద రూపాయల నోట్లు కనిపిస్తే చాలు..బతిమాలి మరీ ధర తగ్గించి రైతులు అమ్ముకుంటున్నారు.

పూట గడవడం కష్టంగా ఉందంటున్న వ్యాపారులు
ఆర్టీసీ బస్సులు.. ప్రైవేట్‌ వాహనాల్లో చుట్టు పక్కల గ్రామాల నుంచి ఇక్కడ సంతకు సరుకులు తీసుకు వస్తుంటారు. తెచ్చినవి అమ్ముడుపోక..కనీస రవాణా ఖర్చులు కూడా రాక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో ఒక్కపూట గడవడం కష్టంగా ఉందని వాపోతున్నారు.  

Don't Miss