బ‌ల్దియా కార్మికులకు నోటు క‌ష్టాలు

12:15 - December 3, 2016

హైదరాబాద్ : నోటు క‌ష్టాలు బ‌ల్దియా కార్మికుల‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తమ నెల జీతం అకౌంట్‌లో ఉన్నా చేతికందని పరిస్థితి. నెల ప్రారంభంలోనే త‌మకు వచ్చే డ‌బ్బులన్నీ ఖ‌ర్చు అయ్యేలా ప్లాన్ చేసుకున్న వేత‌న జీవుల‌కు బ్యాంకులు ఇస్తున్న త‌క్కువ నగ‌దుతో సతమతమౌతున్నారు. దీంతో బల్దియా బ్యాంకు ద్వారా కాకుండా నగదు రూపంలో డబ్బులు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
సామాన్యులకు ఆర్థిక కష్టాలు 
దేశంలో పెద్దనోట్ల రద్దుతో సామాన్యులకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. పెద్ద నోట్లు రద్దై 24 రోజులు పూర్తి అవుతున్నా సరిపడా నగదు అందక ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో తక్కువ డబ్బులు ఇవ్వడం..ఏటీఎంల్లో కూడా డబ్బులు అందుబాటులో లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక నెల ప్రారంభం అవడంతో రెగ్యులర్ గా చెల్లించాల్సిన ఇంటి అద్దె, నెలవారి కిరాణాసరుకులు, స్కూల్ ఫీజులు, విద్యుత్, నీటి బిల్లులు, పాలు. కేబుల్ వంటి బిల్లుల చెల్లింపు క‌ష్టంగా మారింది. తమ తమ అకౌంట్లలో వేతనాలు జీతాలు జమ ఐనా వాటిని తీసుకోలేక, సౌకర్యాలు సమకూర్చుకోలేక సిటిజన్స్ ఇబ్బందులు పడుతున్నారు.
ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు 
ఇక గ్రేటర్ పరిధిలో రెక్కాడితే గాని డొక్కాడని కష్టజీవులు, నెలసరి జీతంపై ఆధారపడ్డ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బులు చేతికందడం లేదని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం వారంలో 24 వేలు విత్ డ్రా చేసుకోవచ్చని చెబుతున్నా ఒక్కో బ్యాంకు నుంచి,..ఒక్కో బ్రాంచిలో  వేరు వేరుగా డబ్బులు వస్తున్నాయి. ఇక బల్దియాలో ఉన్న 26 వేల మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిందరికి బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లదొంగల ఆటకట్టించడానికంటూ ప్రభుత్వ పెద్దలు మాటలు చెబుతున్నారు. నల్లకుబేరులు దొరుకుతారో లేదో కానీ సామాన్యుల కష్టాలు మాత్రం మరింత పెరుగుతున్నాయి. 

 

Don't Miss