కరీంనగర్ లో ఇంకా 'నోట్ల కష్టాలు'..

16:25 - December 4, 2016

కరీంనగర్ : పెద్దనోట్లు రద్దై దాదాపు నెల కావస్తోంది. ప్రజలకు నగదు కష్టాలు మాత్రం తీరడంలేదు. తెలంగాణలోని పలుజిల్లాల్లో మనీప్రాబ్లమ్స్‌ కొనసాగుతూనే ఉన్నాయి. కరెన్సీ కోసం ఎటీఎంల ముందు జనాలు పడిగాపులు పడుతున్నారు. కరీంనగర్‌లో చిల్లర కష్టాలపై 10టివి కథనం. కరీంనగర్‌ పట్టణంలో నగదు నింపిన గంటలోనే ఏటీఎంల్లో కరెన్సీ ఖాళి అవుతోంది. నగరంలో ఎక్కడ చూసిన ఏటీఎంల ముందు భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. చాలాచోట్ల నో క్యాష్ బోర్డులు ,అవుట్‌ ఆఫ్ సర్వీస్‌ బోర్డులు దర్శనమిస్తుండడంతో జనం విసుగుచెందుతున్నారు.

వెలవెలబోతున్న నాన్‌వెజ్‌ మార్కెట్లు..
రూ. 500, రూ. 1000 రూపాయల నోట్ల రద్దు చేసి 28రోజులు అవుతోంది. మార్కెట్ లోకి 2 వేల రూపాయల నోట్లు వచ్చినప్పటికి సరిపడ చిల్లర దొరక్క పోవడంతో ప్రయోజనం లేకుండా పోతుంది. ఇక ఆదివారం ఎక్కువగా గిరాకి ఉండే మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు అమ్మకాల్లేక వెలవెలబోతున్నాయి.

అకౌంట్లో డబ్బులున్నా..చేతికిరాని పరిస్థితి...
మరోవైపు ఉద్యోగులకు జీతాలు వచ్చినా వాటిని వినియోగించుకునే పరిస్థితి మాత్రం కనపడడం లేదు. ఖాతల్లో డబ్బులు ఉన్న వాటిని తీసుకోవాలంటే బ్యాంకుల వద్ద, ఎటిఎం వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. సరిపడ డబ్బులు లేక చాల బ్యాంకులు ఖాతదారులకు చెల్లింపులు కూడా చేయడం లేదు.

సింగరేణి కార్మికులపై నోట్ల రద్దు ప్రభావం..
నోట్ల ప్రభావం తమ కార్మికులపై పడకుండా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక చర్యలను చేపట్టింది. పెద్దపల్లి జిల్ల రామగుండం రీజియన్ లో బొగ్గు గనులకు నోట్ల ప్రభావం పడకుండ బ్యాంకుల వద్ద అధికారులు పత్యేక చర్యలు చేపట్టారు. అయినప్పటికి ఏటీఎంలు సరిగా పనిచేయక క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని కార్మికులు అంటున్నారు. అటు పించన్ కోసం వస్తున్న వృద్ధులు లైన్లలో నిలబడలేక అవస్థలు పడుతున్నారు. నల్లధనం కట్టడికోసం కదా అని సామాన్యులు ఓపిగ్గా క్యూలైన్లలో నిలబడుతున్నారు. కాని ..రోజులు గడుస్తున్నా.. నోట్ల కష్టాలు మాత్రం తీరడంలేదు. ఖాతలో డబ్బులు ఉన్న వినియోగించకోలేని దుస్థితి నెలకోంది.

Don't Miss