ఆరోపణలు, ప్రత్యాపరోణలతో ఎన్నికల వేడి

22:06 - July 21, 2018

హైదరాబాద్ : ఎన్నికలకు ముందే.. కత్తులు దూసుకుంటున్నారు రాజకీయ నేతలు. ఆరోపణలు, ప్రత్యాపరోణలతో ఎన్నికల వేడిని రాజేస్తున్నారు.. అవిశ్వాస తీర్మానంపై ఎవరికి వారే తమదైన శైలిలో స్పందిస్తున్నారు.. తమను తాము సమర్థించుకుంటూనే... ప్రత్యర్థి పార్టీలపై విమర్శల దాడి చేస్తూ ఎలక్షన్‌ స్టంట్‌ను తలపిస్తున్నారు.

ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల దృశ్యాన్ని కళ్ళకు కట్టిస్తున్నారు రాజకీయనేతలు. అవిశ్వాసం చర్చ నేపథ్యంలో ఒకరిపై ఒకరి దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీలు మోసకారి పార్టీలని విమర్శించారు కాంగ్రెస్‌ నేత ఎన్. రఘువీరారెడ్డి. ఆ పార్టీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందన్నారు రఘువీరారెడ్డి. 

మరో వైపు టీఆర్‌ఎస్‌పై టీ కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. పార్లమెంట్‌ సాక్షిగా బీజేపీ-టీఆర్‌ఎస్‌ దోస్తాని బయటపడిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. అవిశ్వాస తీర్మాన సమయంలో టీఆర్‌ఎస్‌ సభ్యులు గైర్హాజరై..  పరోక్షంగా బీజేపీకి మద్దతిచ్చారని విమర్శించారు.  తెలంగాణాకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై  ఏ మాత్రం మాట్లాడలేదన్నారు. 

టీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు  చీకటి  ఒప్పందం ప్రకారం నడుకుంటున్నాయని తీవ్రంగా ఆరోపించారు డీకే అరుణ. ముస్లీం ఓటర్లకు దూరం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.  అందుకే.. పార్లమెంటులో ప్రధాని తెలంగాణాను అవమానించే విధంగా మాట్లాడినా టీఆర్ఎస్‌ నోరు మెదపలేదన్నారు. మొత్తానికి రాజకీయనేతల ప్రసంగాలు.. ఎన్నికల ప్రచార సభలను తలపిస్తున్నాయి. 

Don't Miss