జగ్గారెడ్డికి ఎదురు దెబ్బ...

07:44 - September 12, 2018

హైదరాబాద్ : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి... కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. పాస్‌పోర్టు దుర్వినియోగం, ప్రభుత్వ అధికారులను మోసం చేసిన కేసుల్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్‌కోర్టులో హాజరు పర్చారు. వాద ప్రతివాదనలు విన్న న్యాయస్థానం జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో జగ్గారెడ్డిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

పాస్‌పోర్టు సందర్భంగా జగ్గారెడ్డి చూపించిన పత్రాలు, ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించిన పోలీసులు.. రెండింటికి ఎక్కడా పొంతన లేదని తెలిపారు. ఆధారాల కోసం జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డులు, ఫొటోలు సేకరించారు. తన పాస్‌పోర్టు పోయిందంటూ 2016 జనవరిలో... మరో కొత్త పాస్‌పోర్టును జగ్గారెడ్డి పొందినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే తనను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించిందంటూ జగ్గారెడ్డి ఆరోపించారు.

మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసు ఉన్నందున హైకోర్టుకు వెళ్లాలని న్యాయమూర్తి సూచించారు. కేసులో పురోగతి కోసం జగ్గారెడ్డిని పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.

Don't Miss