చైతన్య సారధికి ప్రముఖుల నివాళి..

21:31 - August 29, 2018

హైదరాబాద్ : రోడ్డు  ప్రమాదంలో దుర్మరణం చెందిన టీడీపీ నేత హరికృష్ణకు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. హరికృష్ణ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. దుఃఖసారగంలో ఉన్న కుటుంబ సభ్యులు ఓదార్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు హరికృష్ణతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

టీడీపీ నేత హరికృష్ణ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. దుఃఖంలో ఉన్నకుటుంబ సభ్యులను ఓదార్చారు.

తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌... హరికృష్ణ నివాసానికి చేరుకుకి భౌతికకాయానికి నివాళులర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరికృష్ణ నివాసానికి చేరుకుని పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరార్శించారు.

హరికృష్ణ రోడ్డు ప్రమాదవార్త విన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... మంత్రి లోకేశ్‌తో కలిసి హుటాహుటిన అమరావతి నుంచి బయలుదేరి హెలికాప్టర్‌లో నల్గొండ చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నార్కెట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి వచ్చి.. హరికృష్ణ భౌతికకాయాన్నిచూసి చలించిపోయారు. చంద్రబాబు, లోకేశ్‌ కన్నీటి పర్యతంమయ్యారు. హరికృష్ణ మృతి తమ కుటుంబానికి, టీడీపీకి తీరనిలోటని... ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణలేని లోటును భర్తీ చేయలేమన్నారు.

తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు హరికృష్ణ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌... హరికృష్ణ మృతికి సంతాపం ప్రకటించారు. హరికృష్ణ మృతి తెలుగు ప్రజలకు తీరలని లోటని టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ అన్నారు. కారు నడుపుతూ సీటు బెల్టు పెట్టుకుని ఉంటే హరికృష్ణ బతికి ఉండేవారని రాజమంత్రి గ్రామీణ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణతో తనకు ఉన్న అనుబంధాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గుర్తు చేసుకున్నారు. :హరికృష్ణ మృతికి టీడీపీ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, టీటీడీ బోర్డు సభ్యుడు పెద్దిరెడ్డి సంతాపం ప్రకటించారు. హరికృష్ణను కడసారి చూసేందుకు ప్రజలు, ఆయన అభిమానులు భారీగా తరలివస్తున్నారు. మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి చేరుకుని నివాళలర్పిస్తున్నారు. 

Don't Miss