సినీ ప్రపంచం నివాళులు...

06:32 - August 30, 2018

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన టీడీపీ సీనియర్‌ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణకు సినీ ప్రపంచం నివాళులర్పించింది. ఆయన కుటుంబ సభ్యులకు సినీ ప్రముఖులు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణకు సినీ జగత్తు నివాళులర్పించింది. సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిజేశారు. ఈ సందర్భంగా హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని సినీ ప్రముఖులు గుర్తుచేసుకున్నారు.

నందమూరి హరికృష్ణ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని హీరో చిరంజీవి అన్నారు. హరికృష్ణ నివాసానికి వచ్చిన చిరంజీవి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆత్మీయ మిత్రుడు, సోదర సమానుడైన హరికృష్ణ మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. హరికృష్ణ ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, హరికృష్ణ కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యం కలిగించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చిరంజీవి అన్నారు. అటు పవన్‌కల్యాణ్‌ సైతం హరికృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తన అన్నయ్య అందరితోను కలుపుకోలుగా ఉండేవారని అన్నాకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. హరికృష్ణ మనతో లేకున్నా ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉంటాయన్నారు. హరికృష్ణ మృతికి సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరికీ బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. హరికృష్ణ తన జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా జీవించాడని బాలకృష్ణ అన్నారు.

హరికృష్ణ మహా మనిషి అని.. ఎవరికి ఏ సాయం కావాలన్నా.. చేసేవారని సినీ నటుడు కృష్ణం రాజు అన్నారు. ఒక మంచి మిత్రున్ని కోల్పోయనని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు కృష్ణం రాజు. హరికృష్ణ మంచి నటుడిగా.. మంచి వ్యక్తిగా గుర్తింపు సంపాదించారని సినీ నటుడు సీనియర్‌ నరేష్‌ అన్నారు. ఎన్టీఆర్‌ చైతన్య రథ సారథిగా హరికృష్ణకు గొప్ప పేరుందని తెలిపారు. హరికృష్ణ మృతి సినీ లోకానికి తీరని లోటని అన్నారు. హరికృష్ణ ఇంత త్వరగా తమని వదిలి వెళ్తారని తాను ఊహించలేదని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటున్నానని నరేష్‌ అన్నారు.

నందమూరి హరికృష్ణ అకాల మరణం తెలుగు సినీ జగత్తుకు తీరని లోటు అన్నారు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌. ఆకస్మాత్తుగా హరికృష్ణ మరణ వార్త వినటం కలిచివేసిందని చెప్పారు. నందమూరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని.. హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరకుంటున్నానని కళ్యాణ్ అన్నారు. హరికృష్ణ మంచి మనిషి అని.. గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు సినీ నటుడు అశోక్‌. ఏ వ్యక్తి ఆపదలో ఉన్న వారికి ఎలాంటి సాయమైనా చేసే వారని తెలిపారు. నందమూరి హరికృష్ణ మరణించటం తెలుగు సినీ పరిశ్రమకు, టీడీపీకి, దేశ రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు సినీ నటుడు ఆర్‌. నారాయణమూర్తి. మానవీయ విలువలు, కుటుంబ విలువలు, సామాజిక విలువలపై నిబద్దత, పట్టు ఉన్న మనిషి హరికృష్ణ అని తెలిపారు. అలాంటి వ్యక్తి చనిపోవటం దురదృష్టకరమని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఆర్‌. నారాయణ మూర్తి చెప్పారు. ఇక హరికృష్ణను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున్న ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. 

Don't Miss