భూమికి చేరువగా చైనా స్పేస్‌ల్యాబ్‌

21:29 - March 31, 2018

బీజింగ్ : చైనాకు చెందిన మానవ నిర్మిత అంతరీక్ష కేంద్రం తీయాంగాగ్‌-1.. ఇపుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇవాళో రేపో భూమిపై కూలిపోయే అవశాశం ఉండటంతో .. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా స్కైలాబ్‌ ప్రపంచాన్ని వణికించగా .. ఇపుడు చైనాకు చెందిన తియాంగాంగ్‌-1 అదేతరహాలో భయపెడుతోంది. 
భయపెడుతున్న తియాంగాంగ్‌-1
చైనాకు చెందిన తొలి అంతరిక్ష పరిశోధనా కేంద్రం టియాంగాంగ్‌-1 పేరు వింటేనే ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నిర్దేశిత ప్రదేశం నుంచి గతితప్పిన చైనా స్పేస్‌ల్యాబ్‌.. భూమివైపు వేగంగా దూసుకు వస్తోంది.  ఇవాళో రేపో అది భూవాతావరణంలోకి ప్రవేశించనుంది. దీంతో అది ఎక్కడ కూలుతుందోనని చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఒకింత ఆందోళనకు గురువుతున్నారు. 
39ఏళ్ల క్రితం భయపెట్టిన స్కైలాబ్‌
దాదాపు 39ఏళ్ల క్రితం స్కైలాబ్‌ భయంతో జనం వణికిపోయారు. 1979 జూలైనెలలో పట్టణాలు, పల్లెలు అనే తేడాలేకుండా ఆకాశంవైపు చూస్తూ బిక్కుమంటూ గడిపారు.  అమెరికాకు చెందిన స్కైలాబ్‌.. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా భయంగొలిపి చివరికి 1979 జూలై11న హిందూమహాసముద్రంలో కూలిపోవడంతో ప్రపంచంఅంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈనేపథ్యంలో ఇపుడు మరోసారి ప్రపంచదేశాలను వణికిస్తోంది.. చైనాకు చెందిన స్పేస్‌ల్యాబ్‌ తీయాన్‌గాంగ్‌-1. 
2011 సెప్టెంబర్‌లో తియాంగాంగ్‌-1ను ప్రయోగం 
2011 సెప్టెంబర్‌లో తియాంగాంగ్‌-1ను ప్రయోగించారు. దీని పొడవు10.4 మీటర్లు,  చుట్టుకొలత  3.35 మీటర్లు. మొత్తం బరువు 8,506 కిలోలు.. అంటే ఎనిమిదిన్నర టన్నులుగా ఉంది. 2018 మార్చి 26 వరకు దాదాపు 6సంవత్సరాల 178రోజులు తీయాంగాంగ్‌-1 కక్ష్యలోనే  ఉంది. తన జీవితికాలంలో ఆర్బిట్‌లో   37, 287 సార్లు పరిభ్రమించింది. రెండేళ్ల జీవిత కాలానికి రూపొందించిన తీయాంగాంగ్‌-1.. షెన్జో-8, షెన్జో-9, షెన్జో-10  ఇలా మూడు మిషన్లకు బేస్‌స్టేషన్‌గా సేవలందించింది. 2013లో షెన్జో-10 తిరిగి భూమికి చేరుకోవడంతో దీనికి అప్పగించిన ప్రధాన లక్ష్యం పూర్తయింది. 
భూమిచుట్టూ అంతరిక్షంలో చక్కర్లు
నిర్దేశిత లక్ష్యాన్ని నెవేర్చిన తియాన్‌గాంగ్‌-1 ఇపుడు గతితప్పి భూమిచుట్టూ అంతరిక్షంలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఇది భూమికి అతి సమీపానికి  వచ్చిందని,  భూవాతావరణంలోకి ప్రవేశించగానే పూర్తిగా మండిపోతుందని చైనా మ్యాన్‌డ్‌ స్పేస్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయం వెల్లడించింది. అయితే ఏ ప్రదేశంలో ఇది భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందనే విషయాన్ని చివరి రెండు గంటల్లో మాత్రమే నిర్దారించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. భూవాతావరణంలోకి రాగానే.. స్పేస్‌ల్యాబ్‌లో కొద్ది మొత్తంలో ఉన్న ఇంధనం మండిపోతుందని.. దీంతో అందులోని ఇతర భాగాలు కూడా కాలిపోతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని వల్ల భూమికి ఎలాంటి హానీ జరగదని.. ఎలాంటి ప్రమాదకరమైన విషవాయువులు కూడా వెలువడవని భరోసా ఇస్తున్నారు. 
మార్చి 16 నుంచి నో సిగ్నల్స్‌ 
మార్చి 16 నుంచి తియాంగాంగ్‌-1 నుంచి సమాచారం అందడం లేదని చైనా అంతరిక్ష ఇంజనీరింగ్‌ అధికారి సోమవారమే తెలిపారు. భూ వాతావరణంలోకి ఇవాళో రేపో ప్రవేశించనున్న తియాంగాంగ్‌-1.. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 4 తేదీల మధ్య కూలిపోయే అవకాశం ఉందని  చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లోనే తీయాంగాంగ్‌ భూమిపై కూలిపోయే అవకాశం ఉంది..దీంతో తియాంగాంగ్‌-1 ఎక్కడ కూలిపోనుంది..? శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు ప్రమాదమేమి ఉండదా..? ఇపుడు ఇవే ప్రశ్నలు జనసామాన్యంలో ఉత్కంఠ రేపుతున్నాయి.  

 

Don't Miss