పేదల సమస్యలు అలాగే ఉన్నాయి : తమ్మినేని

09:41 - December 4, 2016

కామారెడ్డి : దేశానికి స్వాతంత్ర్యంవచ్చి 69 ఏళ్లు దాటుతున్నా ఇంకా నిరుపేదలు అలాగే ఉన్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇల్లిల్లు తిరుగుతూ బిక్షాటన చేసి జీవిస్తున్నవారి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. మహాజన పాదయాత్రలో భాగంగా  సంచార జాతివారిని సీపీఎం పాదయాత్ర బృందం సభ్యులు పరామర్శించారు. ప్రభుత్వ పథకాలేవీ తమకు అందడంలేదని ఈ పేదలు పాదయాత్ర బృందానికి చెప్పుకున్నారు. 
1200 కిమీ పూర్తి 
48వ రోజు కామారెడ్డిలో ప్రారంభమైన పాదయాత్ర... పోసానిపేట, అడ్డూర్‌ ఎల్లారెడ్డి, సదాశివనగర్‌ వరకు కొనసాగింది. 48వ రోజు వరకు పాదయాత్ర 1200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని... సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్‌ ఏమైందని ప్రశ్నించారు.
హామీలను నెరవేర్చని టీ. ప్రభుత్వం 
ఇచ్చిన హామీలను నెరవేర్చని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని తమ్మినేని అన్నారు. రోజురోజుకు రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన మండిపడ్డారు. ప్రజలందరూ బాగుపడే తెలంగాణ కావాలని తమ్మినేని పిలుపునిచ్చారు. 
సంచార కులాల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ 
సంచార కులాల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ రాశారు. బీసీ కులాల్లో అత్యంత వెనకబడిన సంచార కులాల వారు సమాజానికి దూరంగా బతుకులీడుస్తున్నారని తమ్మినేని లేఖలో పేర్కొన్నారు. సంచార కులాల వారికి కనీసం రేషన్‌కార్డులు కూడా లేవని, ఈ తెగల అభివృద్ధి కోసం శ్రీ రేణికే కమిటీ సిఫార్సులను అమలు చేయాలని లేఖలో కోరారు. 

 

Don't Miss