త్వరలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం

08:11 - December 4, 2016

హైదరాబాద్ : జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం పక్కా కార్యాచరణ రూపొందిస్తోంది. జిల్లా కేంద్రాలను హైదరాబాద్‌ తరహాలో మార్చేందుకు స్కెచ్‌ గీస్తోంది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్న కేసీఆర్‌.. జిల్లాల అభివృద్ధిపై దిశా నిర్దేశం చేయనున్నారు. 
కలెక్టర్లతో ప్రదీప్‌చంద్ర వీడియో కాన్ఫరెన్స్‌ 
కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆ జిల్లాల కలెక్టర్లతో ఇంతవరకు సీఎం కేసీఆర్‌ సమావేశం కాలేదు. రెండు నెలలు గడుస్తున్నా పరిపాలనాపరమైన అంశాలు చర్చించలేదు. దీంతో జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలోకి ఎలా వెళ్తున్నాయనే అంశాలపై చర్చించేందుకు త్వరలో ప్రగతిభవన్‌లో కలెక్టర్లతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అయితే అంతకంటే ముందు కొత్తగా నియమితులైన ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశం ద్వారా సేకరించిన వివరాలను బట్టి కేసీఆర్‌ కలెక్టర్లతో సమావేశం కానున్నారు. 
జిల్లాల అభివృద్ధి, కలెక్టర్ల పనితీరు, సమస్యలపై చర్చ 
ప్రధానంగా కలెక్టర్ల సమావేశంలో జిల్లాల అభివృద్ధి, కలెక్టర్ల పనితీరు, సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. జిల్లాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించనున్నారు. కొత్త జిల్లాల అభివృద్ధితో పాటు.. మిగతా జిల్లాల పరిస్థితులపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. కొత్త జిల్లాలకు కేటాయించబడిన అధికారులు ఉత్సాహంగా పని చేస్తున్నందున.. వారికి సరైన సలహాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఇప్పటికే కేసీఆర్‌.. సూచించారు. మరోవైపు హెచ్‌ఎండీఏ, కుడా తరహాలో ప్రతి జిల్లాకు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఔటర్‌ రింగ్‌రోడ్డుతో పాటు.. మౌలిక వసతులు, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు వంటివి ఎలా ఉండాలనే దానిపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. కొత్త జిల్లా కేంద్రాలన్నీ పట్టణ కేంద్రాలుగా మారే అవకాశమున్నందున ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది. హైదరాబాద్‌ తరహాలో ఇబ్బందులు తలెత్తకుండా పెరిగే జనాభాకు అనుకూలంగా.. మౌలిక వసతుల కల్పన ఏర్పాట్లపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. 
ప్రస్తుత పరిస్థితులు అధిగమించేందుకు ప్రత్యామ్నాయాలు
మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు అధికారులకు కేసీఆర్‌.. ప్రత్యామ్నాయ మార్గాలు సూచించే అవకాశం ఉంది. కేబినెట్‌లో తీసుకున్న నగదు రహిత లావాదేవీలపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా చేపట్టిన క్యాష్‌లెస్‌ విధానం.. వాటి ఫలితాలపై నివేదిక సేకరించి.. దానిపై కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నారు. ఇక జిల్లాలోని భూసమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్లకు సూపర్‌ పవర్స్‌ ఇచ్చే అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీనికోసం మార్గదర్శకాలు తయారుచేసే బాధ్యతను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు అప్పజెప్పారు. మొత్తానికి జిల్లాల అభివృద్ధి కోసం.. సీఎం కేసీఆర్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. 

 

Don't Miss