కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్

07:56 - December 4, 2016

హైదరాబాద్ : కార్మిక సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్న ఆయన.. వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యూలర్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. విద్యుత్‌ సంస్ధలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలోనూ సీఎం సానుకూలంగా స్పందించడం హర్షనీయమన్నారు. 
ఉద్యోగుల భద్రతకు సర్కార్‌ శ్రీకారం : మంత్రి జగదీష్ రెడ్డి 
విద్యుత్‌ శాఖలో సిబ్బంది పని తీరును తెలంగాణ సర్కార్‌ గుర్తించిందని మంత్రి జగదీశ్‌ రెడ్డి చెప్పారు. ఉద్యోగుల భద్రతకు సర్కార్‌ శ్రీకారం చుట్టనుందన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న విద్యుత్‌ ఉద్యోగులకు జీవన భద్రత కల్పించడమే కాకుండా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను దశల వారీగా క్రమబద్దీకరిస్తామని మంత్రి తెలిపారు. 
దశలవారిగా క్రమబద్ధీకరణ : మంత్రి జగదీష్ రెడ్డి
విద్యుత్‌ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్న వారి వేతనాలు ఏజెన్సీ నుంచి కాకుండా నేరుగా చెల్లించాలన్న డిమాండ్‌ తోపాటు మరికొన్ని సమస్యలతో సమ్మెకు దిగిన కార్మికుల ఇబ్బందులపై సీఎం తమతో చర్చించారని మంత్రి జగదీశ్‌ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్‌ ఉద్యోగులను దశలవారిగా క్రమబద్ధీ కరించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. 
28వేల ఉద్యోగులకు లబ్ధి : మంత్రి జగదీష్ రెడ్డి  
ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం వల్ల విద్యుత్‌ శాఖలో పని చేస్తున్న 28వేల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని..8వేల మంది ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆర్ధిక శాఖ నుంచి అనుమతి పొందామని మంత్రి తెలిపారు. మరో 5వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు మొదలు పెట్టినట్లు మంత్రి జగదీశ్‌ రెడ్డి చెప్పారు. సమ్మెకు దిగిన కార్మికులు కూడా సీఎం కేసీఆర్‌ స్పందనను చూసి సమ్మె విరమించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి సమ్మెను విరమించిన కార్మికులకు మంత్రి జగదీశ్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.  

 

Don't Miss