దత్తత గ్రామాల్లో కేసీఆర్ పర్యటన..

21:40 - December 2, 2016

సిద్ధిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన దత్తత గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న పనుల గురించి ఆరా తీశారు. అలాగే అభివృద్ధి పనులపై గ్రామస్థుల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన..నిర్మాణదశలో ఉన్న పనుల గురించి ఆరా
సిద్ధిపేట్‌ జిల్లా.. మార్కుక్‌ మండలంలోని దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. గ్రామాలలో పూర్తైన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను.. అంతర్గత సీసీ రహదారులను.. వాటికి ఇరువైపుల నాటిన మొక్కలను ఆయన సందర్శించారు. అలాగే కూడవెల్లి వాగు వద్ద నిర్మించిన చెక్‌ డ్యామ్‌లను చూసి.. సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రవరల్లిలో చివరి దశ నిర్మాణంలో ఉన్న ఫంక్షన్‌హాల్‌ పనులను పరిశీలించి.. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.

సంగారెడ్డి జిల్లాలోని పాండురంగ జలాశయం పరిశీలన
తన పర్యటనలో భాగంగా కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లాలోని పాండురంగ జలాశయాన్ని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి సందర్శించారు. గోదావరి జలాలు 365 రోజులు నిల్వ ఉండేలా జలాశయాన్ని నిర్మించినట్టు ఈ సందర్భంగా కేసీఆర్‌ చెప్పారు. అలాగే ఎర్రవల్లి, నరసన్నపేటలో ఈ నెల 23న సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.గ్రామంలో పనులను పరిశీలించిన అనంతరం.. కేసీఆర్‌ ఫాంహౌస్‌కు తిరిగి వెళ్లిపోయారు. 

Don't Miss