హరీష్ పై కేసీఆర్ ప్రశంసలు..ఎందుకో...

08:43 - December 10, 2017

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్ని శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై రెండు రోజులపాటు క్షేత్రస్థాయి పర్యటన అనంతరం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్కువ వ్యవధిలో అనుమతులు సాధించడానికి కృషి చేసిన మంత్రి హరీష్‌రావుతో పాటు అధికారులను ఈ సందర్భంగా కేసీఆర్ అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్పీ సింగ్, మిషన్ భగీరధ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు, ట్రాన్స్‌కో డైరెక్టర్లు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బ్యారేజీలు, కాలువలు, టన్నెళ్లు, పంప్‌ హౌజ్‌లు, సబ్ స్టేషన్ల పనులను ఒక్కొక్కటిగా కేసీఆర్ సమీక్షించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతులు తదితర అంశాల్లో ఎలాంటి అవాంతరాలు లేనందున ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చివరి దశ పర్యావరణ అనుమతి త్వరలోనే వస్తుందని.. అప్పటికి డిజైన్లు, ఇతర నిర్మాణాల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కోర్టులో సమర్పించిన అఫడవిట్‌కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించామని, మరో రూ. 20 వేల కోట్లు బ్యాంకుల ద్వారా సమకూర్చినట్టు కేసీఆర్‌ తెలిపారు.

పంపు హౌజ్‌లలో మోటార్లను పరిశీలించేందుకు 26 మంది ఇంజనీర్లతో కూడిన ప్యానెల్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. రైతుల సమన్వయంతో విద్యుత్ లైన్లు వేయాలని.. దీనికి సంబంధించి ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులతో కరీంనగర్‌లో సమావేశం నిర్వహించాలని మంత్రి ఈటెల రాజేందర్‌ను కేసీఆర్ కోరారు. వరద కాలువలోకి కాళేశ్వరం నుంచి నీరు వచ్చిన తరువాత ఉండే పరిస్థితిని అంచనా వేసి డిజైన్లు రూపొందించే బాధ్యతను ఇఎస్పీ మురళీధర్‌కు సీఎం అప్పగించారు.

మిడ్ మానేరు డ్యామ్ నిర్మాణంపైనా కేసీఆర్ చర్చించారు. డ్యామ్ నిర్మాణం పూర్తైందని.. రివిట్‌మెంట్ చేస్తున్నామని.. 25 గేట్లకు గానూ.. 10 గేట్లు బిగించామని.. అధికారులు సీఎంకు తెలిపారు. జనవరి నెలాఖరుకల్లా మిడ్ మానేరుకు సంబంధించిన పనులన్నీ వంద శాతం పూర్తి కావాలని సీఎం అధికారులకు ఆదేశించారు. మిడ్‌మానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్ వరకు వెళ్లే టన్నెల్ నిర్మాణ పనులను, రిజర్వాయర్ పనులను కేసీఆర్ సమీక్షించారు. ఆగస్టు నాటికి టన్నెల్ నిర్మాణం పూర్తి చేస్తామని.. సెప్టెంబర్ నాటికి రిజర్వాయర్ పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. సమావేశంలో మంత్రి హరీష్‌ రావుతో పాటు అధికారులపై కేసీఆర్‌ ప్రశంసలు కురిపించారు. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో ఒప్పందాలు కుదర్చడంలో హరీష్‌ ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్‌ కితాబిచ్చారు. 

Don't Miss