'సీమ'ను సస్యశ్యామలం చేస్తాం : చంద్రబాబు

08:16 - December 3, 2016

అనంతపురం : అవాంతరాలెన్ని వచ్చినా ..రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి.. రాష్ట్రానికి నిధులు రాబడుతున్నామన్నారు. అనంతపురం పర్యటనలో ఆయన గొల్లపల్లి రిజర్వాయర్‌ను ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉత్సహాంగా సాగింది. ముందుగా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై భాగమైన గొల్లపల్లి రిజర్వాయర్ ను జాతికి అంకితం చేశారు. తొలుత కృష్ణా జలాలకు పూజలు నిర్వహించిన ఆయన రిజర్వాయర్‌లోకి నీటికి విడుదల చేశారు.
రాయలసీమను అభివృద్ధి పథంలో నడిపిస్తాం : చంద్రబాబు 
ఎన్ని అవాంతరాలు ఎదురైనా... రాయలసీమను అభివృద్ధి పథంలో నడిపిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లాకు కీలకమైన హంద్రీనీవా ప్రాజెక్టును కృష్ణా జలాలతో నింపి... జిల్లాలో చెరువులను నింపిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. రాబోయే రోజుల్లో మడకశిర నియోజకవర్గానికి కూడా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పట్టిసీమ నుంచి వచ్చేఏడాది 80టీఎంసీలను రాయలసీమకు తరలించి సస్యశ్యామలం చేస్తామన్నారు.   
అనంతపురం జిల్లాకు సాగునీరు ఇవ్వడం సంతోషం : బాలకృష్ణ 
అనంతపురం జిల్లాకు సాగునీరు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు... హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. నాడు ఎన్టీఆర్‌ చూపించిన దారిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సాగుతున్నారని.. రాయలసీమ అభివృద్ధికి   టీడీపీ ప్రభుత్వం విరామమెరుగని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై చంద్రబాబు మరోసారి వివరణ
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడంపై ఆయన అనంతపురం సభలో మరోసారి వివరణ ఇచ్చారు. కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే.. పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు తెచ్చుకోవచ్చన్నారు. జిల్లాలో వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు వాతావరణ బీమాతో కలుపుకొని హెక్టారుకు 15వేల రూపాయల నష్టపరిహారం అందిస్తామని బాబు ప్రకటించారు.
పెద్దనోట్ల రద్దుతో వందల కోట్లు నష్టం : చంద్రబాబు
పెద్దనోట్ల రద్దు సమస్యతో రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం వస్తోందన్నారు చంద్రబాబు. కష్టాలొచ్చాయని..వ్యాపారాలు మానేస్తే.. అభివృద్ధిలో వెనుకబడతామన్నారు.  నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలు తీరడానికి మరికొంత సమయం పడుతుందని..  అప్పటిదాకా ఓపికపట్టాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో యువత పాల్గొనాలని చంద్రబాబు సభలో పిలుపునిచ్చారు. నగదు రహిత లావాదేవీలను గ్రామీణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత యువతదేనని తెలిపారు. 

 

Don't Miss