చంద్రబాబుపై ఆగ్రహించిన ఏఐబీవోఏ..

15:30 - December 2, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంతో బ్యాంకులు విఫలమయ్యాయంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించడాన్ని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం తప్పుపట్టింది. చంద్రబాబు తన కోపతాపాలను కేంద్ర ప్రభుత్వంపై చూపితే మంచిదని సూచించింది.

బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య పెంచాలి : ఏబీఓఏ
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టకుండా నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆరోపించింది. బ్యాంకుల్లో కావాల్సినంత డబ్బు అందుబాటులో లేకపోవడంతో ప్రజలకు లిమిటెడ్‌గానే డబ్బు చెల్లింపులు చేసే పరిస్థితి నెలకొందని అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు అలోక్‌ ఖరే అన్నారు. ప్రజలకు సేవలు చేసేందుకు బ్యాంకు ఉద్యోగులు ఎక్కువ సమయం పనిచేస్తూ తమవంతు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 5 వందలు, వంద నోట్ల కొరత తీవ్రంగా ఉందని, సరిపడా నోట్లు ముద్రించడంలో కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్‌ విఫలమయ్యాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బ్యాంకులను విస్తరించి ఉద్యోగుల సంఖ్య పెంచాలని ఆల్‌ ఇండియా బ్యాంకర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. మనదేశంలో13 వేల మందికి ఒక బ్యాంకు ఉందని, అదే అమెరికాలో 3 వేల మంది ఒక బ్యాంకు ఉందని ఆయన అన్నారు.

Don't Miss