అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కేసులో మలుపు

21:39 - December 9, 2016

ఢిల్లీ : అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసు పెద్ద మలుపు తిరిగింది. వైమానికదళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. త్యాగి సోదరులు జూలీ, న్యాయవాది గౌతం ఖేతాన్‌లను కూడా సిబిఐ అదుపులోకి తీసుకుంది.
సిబిఐ దర్యాప్తు ముమ్మరం 
అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల స్కాంపై సిబిఐ దర్యాప్తు ముమ్మరం జేసింది. ఈ స్కాంకు సంబంధించి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ వైమానికదళ అధిపతి ఎస్పీ త్యాగిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఢిల్లీకి చెందిన న్యాయవాది గౌతమ్‌ ఖేతాన్‌తో పాటు త్యాగి సోదరుడు సంజీవ్‌ త్యాగి అలియాస్‌ జూలీని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ ఒప్పందంలో ఈ ముగ్గురు అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ ఆరోపించింది.  విచారణకు సహకరించకపోవడంతో వీరిని అరెస్ట్‌ చేసినట్లు సిబిఐ తెలిపింది. 
అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం
2010లో యూపిఏ హయాంలో వివిఐపిల కోసం 3 వేల 6 వందల కోట్లతో 12 హెలిక్యాప్టర్లను కొనుగోలు చేసేందుకు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదిరింది. ఇందులో 10 శాతం ముడుపులు చెల్లించినట్లు తెరపైకి వచ్చింది. మాతృ సంస్థ ఫిన్‌మెక్కానికా ఇటలీలో ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి. దర్యాప్తులో భారత్‌లోనూ ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2013లో ఈ ఒప్పందాన్ని యూపిఏ ప్రభుత్వం రద్దు చేసుకుంది.
త్యాగి కీలక పాత్ర 
హెలిక్యాప్టర్ల ఫ్లయింగ్‌ సీలింగ్‌ను 6 వేల మీటర్ల ఎత్తు నుంచి 4 వేల 5 వందల మీటర్ల ఎత్తుకు తగ్గించడంలో త్యాగి కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంలో మాజీ ఎయిర్‌ చీఫ్‌ ఎస్పీ త్యాగితో పాటు ఈ స్కాంలో మొత్తం 13 మందిపై సిబిఐ కేసు నమోదు చేసింది. త్యాగిని ఇదివరకే పలుమార్లు సిబిఐ ప్రశ్నించింది. ఈ నిర్ణయం సామూహికంగా తీసుకున్నదేనని త్యాగి చెప్పారు. అగస్టా మధ్య వర్తులతో ఆయన సోదరులకు పరిచయాలున్నాయన్న ఆరోపణలున్నాయి.
కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు : మిలాన్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌  
హెలిక్యాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని ఇటలీ లోని మిలాన్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ స్పష్టం చేసింది. ఇందులో భారత మాజీ వైమానికదళ అధిపతి ఎస్పీ త్యాగికి సంబంధం ఉందని పేర్కొంది. భారత అధికారులకు 90 నుంచి 225 కోట్ల వరకు ముడుపులు చెల్లించినట్లు తెలిపింది. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ చీఫ్‌ ఓర్సీని కూడా దోషిగా నిర్ధారించింది.

 

Don't Miss