పార్లమెంట్..మెట్టు దిగని ప్రభుత్వం..

21:37 - December 5, 2016

ఢిల్లీ : నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాలు పట్టు వీడడం లేదు...ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. తామిచ్చిన వాయిదా తీర్మానం ప్రకారం చర్చించి ఓటింగ్‌ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఓటింగ్‌ లేకుండా ఏ నిబంధన ప్రకారమైన చర్చకు సిద్ధమేనని అధికార పక్షం చెప్పడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. విపక్షాల ఆందోళన మధ్య పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే నిబంధన 184 ప్రకారం చర్చ జరిపి ఓటింగ్‌ జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. నోట్ల రద్దుతో జీతాలు, పెన్షన్‌ తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. గత 50 రోజుల్లో లక్షా 28 వేల కోట్ల నష్టం వాటిల్లిందని... పది లక్షల మంది ఉపాధి కోల్పోనున్నట్లు కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. చర్చ నుంచి ప్రభుత్వమే పారిపోతోందని ఖర్గే ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో యూపీలో ఇద్దరు మహిళలు మృతి చెందారని దేశ వ్యాప్తంగా మొత్తం 105 మంది మరణించారని ఎస్పీ సభ్యులు ములాయంసింగ్‌ యాదవ్‌ అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ప్రతిపక్షాల సూచనలను తాము స్వీకరిస్తామని, నిబంధనలు పక్కన బెట్టి దీనిపై చర్చిద్దామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విపక్షాలకు సూచించారు. నల్లధనాన్ని అరికట్టి ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసేందుకే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన నడుమ లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.

రాజ్యసభలో..
అటు రాజ్యసభలోనూ ఇదే అంశంపై చర్చ సాగింది. రాజ్యసభ ప్రారంభంలోనే నోట్ల రద్దుతో పార్లమెంట్‌ ఎటిఎంలలోనే డబ్బులు లేవని, బయట పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని కాంగ్రెస్‌ నేత ఆజాద్‌ అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని, ఉద్యోగులు జీతాలు అందుకోలేని స్థితి ఏర్పడిందని ఆనంద్‌శర్మ ఆరోపించారు. ఈ అంశంపై చర్చించాలని డిప్యూటి ఛైర్మన్‌ కురియన్‌ సూచనను పట్టించుకోని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో రాజ్యసభను డిప్యూటి చైర్మన్‌ సోమవారానికి వాయిదా వేశారు.

Don't Miss