ఉభయ సభలను కుదిపేసిన ప.బెంగాల్ ఆర్మీ రగడ..

15:36 - December 2, 2016

ఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో ఆర్మీ వ్యవహారం రాజ్యసభను కుదిపేసింది. ఉదయం వాయిదా అనంతరం.. మధ్యాహ్నం రెండున్నరకు సమావేశమైన సభలో... బెంగాల్‌లో సైన్యం మొహరింపుపై టీఎంసీ పెద్దనోట్లపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. డిప్యూటీ ఛైర్మన్ పదేపదే విజ్ఞప్తి చేసినా.. పరిస్థితి అలాగే ఉండటంతో.. సభను సోమవారానికి వాయిదా వేశారు. 

లోక్ సభలోనూ ఇదే తీరు 
లోక్ సభలో ప.బెంగాల్ రగడబెంగాల్‌లో ఆర్మీ మోహరింపుపై లోక్‌సభలో వాడీవేడీగా చర్చ జరిగింది. సభ ప్రారంభంకాగానే పశ్చిమ బెంగాల్‌లో బలగాల మోహరింపుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఆర్మీని ఎలా మోహరిస్తారని టీఎంసీ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ ప్రశ్నించారు. రాజకీయాల కోసం సైన్యాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. మోహరించిన బలగాలను వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజకీయాల కోసం ఆర్మీని వాడుకోవడం లేదని కేంద్రమంత్రి అనంతకుమార్‌ అన్నారు. దేశ రక్షణ కోసమే ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్మీ తనిఖీలు నిర్వహిస్తోందని రక్షణశాఖ మంత్రి పారికర్‌ స్పష్టం చేశారు. సాధారణ తనిఖీలను రాజకీయం చేయొద్దని ఆయన సూచించారు. నవంబర్‌లో జరగాల్సిన ఆర్మీ తనిఖీలు అనివార్య కారణాలరీత్యా డిసెంబర్‌కు వాయిదా పడ్డాయన్నారు. అయితే బలగాలను ఉపసంహరించాల్సిదేనని టీఎంసీ సభ్యులు పట్టుబట్టారు.

 

Don't Miss