జయలలితకు సంతాపం తెలిపిన ఉభయసభలు ..

11:13 - December 6, 2016

ఢిల్లీ :

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు పార్లమెంటు ఉభయ సభలు ఘనంగా నివాళులు అర్పించాయి. ముందుగా ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అధ్యక్షతన సమావేశమైన రాజ్యసభలో.. జయలలిత నాయకత్వ పటిమను ప్రశంసించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆమెకు సంతాప సూచకంగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ అన్సారీ ప్రకటించారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన లోక్‌సభ సమావేశమైంది. జయ ఆత్మకు శాంతి కలగాలంటూ లోక్‌సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత జయలలితకు సంతాప సూచకంగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు పలువురు ఎంపీలు పార్లమెంటు వెలుపల కూడా ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.

జయలలితకు పలువురి సంతాపం..
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూతపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయలలిత మృతితో దేశం ఒక శక్తివంతమైన నాయకురాలని పోల్పోయిందని సంతాప సందేశాల్లో పేర్కొన్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన నేతను కోల్పోవడం దురదృష్టకరమంటూ సానుభూతి తెలిపారు. ఇంకా పలు రాష్ట్రాల సీఎంలు... పార్టీ అధినేతలు..నాయకులు, ప్రముఖులు ఆమెకు సంతాపం తెలిపారు.

సోమవారం రాత్రి 11.30గంటకు మృతి చెందిన జయలలిత..
ముఖ్యమంత్రి జె.జయలలిత మరలిరాని లోకాలకు తరలి వెళ్లారు. సోమవారం రాత్రి 11.30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో యావత్‌ తమిళ రాష్ట్రం దిగ్భ్రాంతికి గురైంది. జ్వరం, డీ హైడ్రేషన్‌ కారణంగా సెప్టెంబర్‌ 22న అపోలో ఆసుపత్రిలో చేరిన జయ.. గడచిన 75 రోజులుగా మృత్యువుతో పోరాడారు. అమ్మ కోలుకున్నారని.. ఏ క్షణంలోనైనా ఇంటికి తిరిగొస్తారని ఎదురు చూస్తున్న అన్నాడిఎంకే శ్రేణులకు అమ్మ లేరన్న వార్త పిడుగుపాటే అయింది. తమిళనాడు వీధివీధినా.. అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం కార్యకర్తలు, జయలలిత అభిమానుల రోదనలు మిన్నంటుతున్నాయి. జయ ఆరోగ్యం కుదుటపడిందని.. ఏ క్షణంలోనైనా ఆమె ఇంటికి వెళ్లొచ్చంటూ వైద్యులు చేసిన ప్రకటనలు.. అంతలోనే కల్లలయ్యాయి. తమిళప్రజలను కన్నీటి సంద్రంలో ముంచి అమ్మ మరలిరాని లోకాలకు తరలి వెళ్లారు.

Don't Miss