నల్లధనం ఎక్కడ పోగవుతోంది..?

07:09 - December 2, 2016

హైదరాబాద్ : నల్లధనం కట్టడి కోసం మోదీ తీసుకున్న పెద్ద నోట్ల నిర్ణయంతో సాధారణ ప్రజలు, చిరువ్యాపారులు, ఉద్యోగులతో పాటు కష్టజీవులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. కానీ.. అసలు నల్లధనం ఎక్కడ పోగవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్నది ఈ నల్లధనమేనా...? లేక నల్ల ఆర్థిక వ్యవస్థనా...? నల్లధనం పేరుకుపోవడానికి అసలు కారకులెవరు..? చూద్దాం.... 
పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు 
పెద్ద నోట్ల రద్దు వల్ల.. దేశంలోని కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కడ లేని కష్టాలకు గురవుతున్నారు. మోదీ నల్లధనం కట్టడికి తీసుకున్న నిర్ణయం అధికంగా పేదలు, సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోంది. అసలు దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య నల్లధనమేనా.. లేక నల్ల ఆర్థిక వ్యవస్థా అన్న ప్రశ్న తలెత్తుతోంది. చిరువ్యాపారులు, కార్మికులు, కష్టజీవుల వద్ద నల్లధనం ఉండదనేది వాస్తవం. బడా వ్యాపారులు, సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజాలు, బూర్జువా రాజకీయ నాయకుల వద్దే భారీగా నల్లధనం ఉంటుందనేది విశ్లేషకుల వాదన. 
నల్లధనానికి మూలాలు ఇవే 
దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న స్మగ్లింగ్‌, అక్రమ వ్యపారాలు, అక్రమ లావాదేవీలతో పాటు మాదక ద్రవ్యాల ఎగుమతి, దిగుమతులు, అక్రమ ఆయుధ వ్యాపారాలు, మనీ లాండరింగ్‌, అక్రమ నిధులను విదేశీ సంస్థల నుంచి సేకరించడం.. ఇవే నల్లధనానికి మూలాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు... చట్టబద్ధ వ్యాపారాల్లో కూడా పన్ను ఎగవేతతో నల్ల ధనం పోగవుతుంది. నల్లధనం కట్టడి చేస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం... విజయ్‌మాల్యా వంటి బడా బాబులకు చెందిన 7016 కోట్ల మొండి బకాయిలను రద్దు చేసింది. మరో 31 మంది పన్ను బకాయిల ఎగవేత దారులకు పాక్షిక రుణమాఫీ ప్రకటించింది. బడా కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
ప్రతి లక్ష పెద్ద నోట్లలో 250 వరకు నకిలీ కరెన్సీ
ప్రతి లక్ష పెద్ద నోట్లలో 250 వరకు నకిలీ కరెన్సీ ఉంటుంది. అంటే పెద్ద నోట్ల చలామణిలో ఇది 0.00025 శాతం మాత్రమే. దీనిని అరికట్టాలంటే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నియంత్రించ వచ్చు. కానీ పాలక వర్గాలకు నిజాయితీ, చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఆ పని చేయడం లేదన్న వాదన వినిపిస్తోంది. స్వార్ధపూరిత రాజకీయ ప్రయోజనాలను విడనాడకపోవడమే దొంగనోట్ల వ్యవహారాన్ని నిర్మూలించలేక పోవడానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  
స్తంభించిన రిటైల్డ్‌ మార్కెట్‌ 
నోట్ల రద్దుతో రిటైల్డ్‌ మార్కెట్‌లో కార్యకలాపాలు స్తంభించాయి. ప్రజలు దైనందిన కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని స్థితి ఏర్పడింది. మరోవైపు బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. హవాలా కార్యక్రమాలు ఊపందుకున్నాయి. నోట్ల మార్పిడికి మధ్య దళారీ వ్యవస్థ మరింత క్రియాశీలంగా ముందుకొచ్చింది. ఆర్థికాభివృద్ధి వృద్ధిరేటు తగ్గి.. ఉపాధి అవకాశాలు మరింత దిగజారాయి.  పెద్ద నోట్ల రద్దుతో.. సాధారణ ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రజల పొదుపు ఖాతాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది.  జనజీవనం చిన్నాభిన్నమైంది. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యధిక శాతం నగదు రూపంలోనే  నిర్వహించబడుతుందనే విషయాన్ని.. మోదీ ప్రభుత్వం పట్టించున్నట్లు లేదు.  
నల్లధనం ఉత్పత్తికి అక్రమ వ్యాపారాలే పునాది  
నల్లధనంలో ప్రధాన భాగం బంగారం, వజ్రాలు, స్తిరాస్తులేనని, నల్లధనం ఉత్పత్తికి పునాది అక్రమ వ్యాపారాలేనని రిజర్వ్‌బ్యాంక్‌ గణాంకాల వివరాలు చెబుతున్నాయి. కరెన్సీ కల్లోలంలో ఎక్కడా నల్ల కుబేరులు కన్పించరు. కష్టాలన్నీ సామాన్యులకే తప్పా.. బడా బాబులకు కాదన్నది ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అర్ధం అవుతోంది. విదేశీ ప్రయాణాలు, విందులు, విలాసాలు, దళారీ దందాలు, షేర్‌ మార్కెట్‌ లావాదేవీలు, జీరో వ్యాపారాలు, హవాలా మార్పిడులు వంటి అక్రమ కార్యకలాపాలు సజావుగానే సాగుతున్నాయి. దేశంలో పెద్ద రాష్ట్రాలతో సహా ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు.. ఆర్థిక వ్యవస్థను వెంటాడుతున్న ద్రవ్య లోటును తగ్గించడం, స్వదేశీ, విదేశీ బడా పెట్టుబడి సంస్థల్లోకి ప్రజల సొమ్మును సమీకరించేందుకే బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్ల నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

 

Don't Miss